తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆయా పార్టీలలో టెన్షన్ పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీలో ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. గెలుస్తామనుకున్న కర్నాటకలో ఓడిపోవడంతో ఆ పార్టీ తెలంగాణలో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందా అని కమలనాథులు భయపడుతున్నారు. ఎందుకంటే కర్నాటకతో పోల్చితే తెలంగాణలో బీజేపీ బలం చాలా తక్కువ పైగా ఇక్కడ బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజా మద్దతు చాలా ఎక్కువ. ఆ పార్టీని దాటుకొని అధికారం చేజిక్కించుకోవడం కాషాయ పార్టీకి అంతా తేలికైనా విషయం కాదు. ఈసారి ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ దిగ్విజయం సాధించే అవకాశం ఉందని ఈపాటికే సర్వేలు చెబుతున్నాయి.
దాంతో బిఆర్‌ఎస్ ను ఎలా ఎదుర్కోవలనే దానిపై కమలనాథులు మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పొంగుకోవడంతో బీజేపీ వినికిడి చాలా వరకు తగ్గింది. ఇప్పటికే బిఆర్‌ఎస్ తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రేస్ లో దూసుకుపోతోంది. అటు కాంగ్రెస్ కూడా అభ్యర్థులపై కసరత్తులు చేస్తోంది. బీజేపీ మాత్రం ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుంటోంది. ఎందుకంటే బీజేపీలో నియోజిక వర్గాల వారికి బలమైన అభ్యర్థులు లేకపోవడం. అలాగే బరిలో నిలిచే అభ్యర్థులను వెతుక్కోవడం కాషాయ నేతలకు పెద్ద టాక్స్ లా మారింది. పైగా ఈసారి ప్రతిఒక్క బీజేపీ నేత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని అమిత్ షా స్పష్టమైన సూచనలు చేశారట.
దీంతో లోక్ సభ ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్న కొంతమంది నేతలకు ఏం చేయాలో అర్థం కావట్లేదాట. ఎందుకంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి, విజయశాంతి వంటి పార్టీ కీలక నేతలే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దాంతో ఈసారి కూడా ఓటమి భయంతో వారు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు టాక్. ఇన్ని అవరోధాల మద్య బీజేపీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. నేడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. చేవెళ్ళలో జరిగే సభకు ఆయన హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయన ఎలాంటి దిశ నిర్దేశం చేయనున్నారు. నత్త నడకన సాగుతున్న కమలనాథులను పరుగెత్తిస్తారా ? అసలు తొలి జాబితా అభ్యర్థుల ప్రకటన ఎప్పుడనే దానిపై క్లారిటీ ఇస్తారా ? అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. మరి బీజేపీ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Also Read:దోసకాయతో ఉపయోగాలు..