IPL 2024: అసలు పరీక్ష చెన్నైకే?

52
- Advertisement -

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ధనాధన్ ఐపీఎల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇరు జట్లు కూడా తొలి మ్యాచ్ లో గెలిచి సీజన్ ను ఘనంగా ఆరంభించాలని చూస్తున్నాయి. అటు ధోని ఇటు కోహ్లీ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ కావడంతో ఇద్దరి మద్య పోరు చూసేందుకు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ సి‌ఎస్‌కే మరియు ఆర్సీబీ రెండు జట్లకు కూడా కొంత ప్రత్యేకమే. ఎందుకంటే ఐపీఎల్ ప్రారంభం నుంచి సి‌ఎస్‌కే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఐదు ట్రోఫీలు అందించిన ఎం‌ఎస్ ధోని ఈసారి కెప్టెన్ గా కాకుండా కేవలం ఆటగాడిగా కొనసాగనున్నాడు..

సరిగ్గా ఐపీఎల్ ప్రారంభానికి ఒక రోజు ముందు ధోని స్థానంలో ఋతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా ప్రకటించింది సి‌ఎస్‌కే యజమాన్యం. దీంతో తొలిసారి ధోని కెప్టెన్సీ లేకుండా బరిలోకి దిగుతున్న సి‌ఎస్‌కే ఎలా ఆడబోతుందనేది క్రీడా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ధోని మొదటిసారి ఐపీఎల్ లో ప్లేయర్ లా ఆడబోతున్నాడు. దీంతో వింటేజ్ ధనాధన్ ధోనిని చూడవచ్చని అభిమానులు భావిస్తున్నారు. తొలి సారి కెప్టెన్ ను మార్చిన చెన్నైకి ఈ సీజన్ ఒక పరీక్ష లాంటిదే.

అటు ఆర్సీబీ విషయానికొస్తే పదహారేళ్ళ నుంచి ఆ జట్టును కప్పు ఊరిస్తూనే ఉంది. జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్నప్పటికీ టైటిల్ విజేతగా మాత్రం నిలవడం లేదు. దాంతో ఈసారి ఎలాగైనా కప్పు గెలిచి కల నెరవేర్చుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ఇక ప్రస్తుతం ఇరు జట్లలో బలమైన ఆటగాళ్లు ఉన్నారు. చెన్నై తరుపున రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, ధోని, జడేజా, శివం దుబే.. ఇలా పటిష్టమైన బ్యాటింగ్ దళం ఉంది. అటు ఆర్సీబీ తరుపున ఫాబ్ డూప్లిసి, విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్, వంటి వారితో బలంగానే కనిపిస్తోంది. మరి ఇరు జట్ల మద్య జరుగుతున్న తొలి మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించి బోణి కొడుతుందో చూడాలి.

Also Read:56 మందితో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్..

- Advertisement -