మళ్లీ ఐపీఎల్ సీజన్ మొదలైంది. బుధవారం నుంచే 10వ సీజన్ స్టార్ట్ కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. హోమ్ టీమ్ హైదరాబాద్‌తో బెంగుళూర్ తలపడనుంది. ఫైనల్ మ్యాచ్‌ను కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 8 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇవాళ సాయంత్రం 6.20 గంటలకు ఐపీఎల్ వేడుకను అట్టహాసంగా నిర్వహించనున్నారు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. అరగంట పాటు ఆరంభోత్సవం ఉంటుంది. సాయంత్రం 6.20కి దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ గోల్ఫ్ కార్ట్‌లలో మైదానంలోకి వస్తారు.
దిగ్గజాల ఘనతలను కీర్తిస్తూ ఆడియో, వీడియో ప్రదర్శించాక సన్మానం ఉంటుంది. అనంతరం ఐదుగురు క్రికెటర్లు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. తర్వాత బాలీవుడ్ నటి అమీ జాక్సన్ డ్యాన్స్‌తో అలరించనుంది. ఎఆర్ రెహమాన్ కూడా తన పాటతో అలరించనున్నాడు. ఆరంభ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా రానున్నారు. 7 గంటలకు మైదానంలో సన్‌రైజర్స్, బెంగళూరు ఆటగాళ్ళ వార్మప్ మొదలవుతుంది. 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
భుజం గాయంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ వ్యవహరించనున్నాడు. మరో కీలక బ్యాట్స్ మెన్ డివిలియర్స్ బ్యాక్ పెయిన్‌తో బాధ పడుతుండటంతో ఐపీఎల్ తొలి మ్యాచ్‌కు అతడు కూడా దూరం అయినట్లు తెలుస్తోంది.