వెంకన్న పాటకు అంతర్జాతీయ గుర్తింపు..

203
Internationational recognition for goreti venkanna
Internationational recognition for goreti venkanna
- Advertisement -

‘పల్లె కన్నీరు పెడుతోందే.. కనిపించని కుట్రల’ అంటూ పల్లె సంస్కృతిని దెబ్బ తీసిన ప్రపంచీకరణ వైనాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పిన ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న. బలహీన వర్గాల పక్షాన బలమైన సాహిత్యంతో గళం విప్పిన ఆయన.. తెలంగాణ , సీమ అంటూ తేడా లేకుండా సుమధుర సాహిత్యంతో ప్రజల గుండెల్లో ప్రత్యేక చోటు సంపాదించుకున్నారు. పల్లె, ప్రజలు, ప్రకృతే ఆయన పాటలకు ప్రాణాధారం. ఆయన అక్షరాల పూదోట మీద చల్లగా ప్రసరించింది సోయగమే వెన్నెల గేయం. గోరేటి రాసిన ఆ పాట ఇప్పుడు విశ్వవ్యాప్తం కానుంది. సోయగమే వెన్నెల పాటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.

15 ప్రాంతీయ భాషల్లో నుంచి ఒక్కో గేయం చొప్పున ఎంపిక చేయగా… అందులో తెలుగు నుంచి గోరేటి వెంకన్న పాటకు స్థానం దక్కడం విశేషం. రాజా ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా ఢిల్లీలో ది రాజా బై యాన్యువల్ ఆఫ్ ఇండియన్ పొయట్రీ పేరిట 15 భాషలకు చెందిన 45 మంది కవులు, రచయితలతో త్రివేణి కళా సంగమంలో సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి హాజరైన గోరేటి వెంకన్న.. వేదిక మీద తన సోయగమే వెన్నెల పాట పాడి, ఆ పాట నేపథ్యం, సందర్భాలను వివరించారు.

గోరేటి గేయానికి శ్రోతలంతా మైమరచిన ఆహుతులు.. సోయగమే వెన్నెల గేయం అద్భుతమని ప్రశంసించారు. వెంకన్న పాటను ఆంగ్లంలోకి అనువదించాల్సిన అవసరాన్ని ప్రముఖ సాహితీవేత్త అశోక్ బాజ్‌పేయి వివరించారు. సామాజిక నేపథ్యాన్ని గేయం రూపంలో రాయడమే కాకుండా ప్రజల నాలుకలపై నిలిచేలా దాన్ని ఆలపించడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నదని ఆయన ప్రశంసించారు. అటు దేశంలోని ప్రాంతీయ భాషల్లో ఉన్న సాహిత్యాన్ని అనువదించి వివిధ ప్రపంచ దేశాలకు చేరవేయడానికి రాజా ఫౌండేషన్ చేస్తున్న కృషిని గోరేటి అభినందించారు. సాహితీ లోకానికి ఇది సంతోషకరమైన విషయమన్నారు. తన గేయాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించే కార్యక్రమానికి రావటం ఆనందంగా ఉందని చెప్పారు.

- Advertisement -