మత్తు వదిలిద్దాం…నేడు మత్తు పదార్ధాల వ్యతిరేక దినోత్సవం

372
anti drugs day

ఆల్కహాల్ ఒకప్పుడు వ్యసనం, ఇప్పుడు కల్చర్‌లో ఓ హ్యాబిట్. తాగుబోతులను నీచంగా చూసే రోజులు పోయి… మందు ముట్టని వాడిని విచిత్రంగా చూసే రోజులు వచ్చాయి. విందు,వినోదం,పెళ్లి,చావు ఏదైనా కొత్త బిచ్చగాడికి పొద్దు ఎరగడు అన్నట్టుగా మామ ఎక్‌ పెగ్‌లా అంటూ విచ్చలవిడిగా తాగేస్తున్నారు. గెలిస్తే సంతోషంతో ఓడితే బాధలో ఏదైనా మత్తులోనే యావత్ ప్రపంచం ఊగిపోతోంది. మద్యమే కాదు గంజాయి, ఎపిడ్రిన్‌, కొకైన్‌, ఓపియమ్‌ (నల్లమందు), హెరాయిన్‌, బ్రౌన్‌షుగర్‌, కెటామైన్‌… పేరేదైతేనేం.. ఈ మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యాలను చిత్తు చేస్తున్నాయి.

అందుకే ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మత్తు పదార్ధాల ఉపయోగం వల్ల దుష్ఫలితాలు తెలిపి, అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ఏర్పాటు ముఖ్యఉద్దేశ్యం.

మత్తుకు అలవాటైన వారు కడుపు నిండా ఆహారం లేకపోయినా ఆకలిని భరిస్తారు.. కానీ అవి దొరక్కపోతే మాత్రం తట్టుకోలేక మానసిక సమతుల్యతను కోల్పోతున్నారు. మాదకద్రవ్యాలకు కట్టు బానిసలుగా మారి ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్న వారెందరో.

ముఖ్యంగా డ్రగ్స్‌ మాయలో పడి యువత విలువైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ మూలంగా పెడదారి పడుతున్నారు. మత్తుకు అలవాటుపడి వారి జీవితాలను నాశనం చేసుకోవడం కాకుండా కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు. అంతేగాదు తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండి గొప్ప చదువులు చదువుతున్నారని కలలుగంటున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతుంది.

మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని వాటి నుంచి దూరం చేయడానికి మందులతోపాటు కౌన్సెలింగ్‌ అవసరమవుతుంది. ఇందులో వైద్యుల పాత్ర ఎంత కీలకమో, రోగులు, వారి కుటుంబ సభ్యుల భాగస్వామ్యమూ అంతే ముఖ్యం. చికిత్స పొందిన వారు మత్తును వదిలిన వారెందరో ఉన్నారు. సరైన చికిత్స తీసుకుంటే 90 శాతం మత్తు బానిసత్వం నుండి విముక్తి పొందవచ్చు.