ప్రజా సంక్షేమం కోసం లాక్ డౌన్ విధింపు- మంత్రి అల్లోల

67
Indrakaran Reddy

ప్రజల సంక్షేమం కోసం, విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని, పకడ్బందీగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని, ప్రజలు సహకరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లాలోని నస్పూర్ సింగరేణి అతిథి గృహంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ లు ఇలా త్రిపాఠి, మధుసూదన్ నాయక్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ రెండవదశ నియంత్రించడం కోసం ప్రభుత్వం పది రోజులు లాక్ డౌన్ విధించడం జరిగిందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మనోధైర్యంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో రోజుకు 13 వందల టెస్టులు చేయడం జరుగుతుందని, పాజిటివ్ వచ్చిన వారికి వెంటనే మందులు ఇవ్వడం జరుగుతుందని, లక్షణాలు కలిగి ఉన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెస్ట్ చేయడంతో పాటు టెస్ట్ కోసం వేచి చూడకుండా లక్షణాలు కలిగిన వారికి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో 174 అర్బన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మందుల కిట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్ చికిత్స చేసేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో క్వారంటైన్ సెంటర్ తోపాటు కొవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ లో నెంబర్ 08736-250501 ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో 24 గంటలు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్ సిలిండర్లు రోజుకు 350-400 అవసరం ఉందని, రెమిడీసివిర్ ఇంజక్షన్లు జిల్లాకు 300 ఇవ్వడం జరుగుతుందని, డోర్ టు డోర్ సర్వే ద్వారా గుర్తించిన 900 మందిని హాస్పిటల్ కు పంపడం జరిగిందని, క్రొత్తగా బ్లాక్ ఫంగస్ వ్యాప్తిపై దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని, అధికార యంత్రాంగం విశేష సేవలు అందిస్తుందని, ప్రజలు సహకరించాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా లో లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించి పోలీసు అధికారులకు తగు సూచనలు సలహాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ అఖిల్ మహాజన్, జిల్లా ఇన్ చార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ అరవింద్, రాజస్వ మండల అధికారి వేణు, సింగరేణి డైరెక్టర్ బలరాం, వైద్యాధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.