వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాలో తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం నిర్ల‌క్ష్యం…

49
dayakarrao

క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌, బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించ‌డానికి ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సదుపాయాలు ప్ర‌భుత్వం క‌ల్పిస్తుందని, అందుకు వైద్యులు స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం హ‌న్మ‌కొండ‌లో వ‌రంగ‌ల్ అర్భ‌న్‌, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాల్లో క‌రోనా వ్యాప్తికి చేప‌ట్టిన చ‌ర్య‌లు, కోవిడ్ బాధితుల‌కు అందుతున్న చికిత్స‌, ఆసుప‌త్రుల్లోని ఏర్పాట్లపై వైద్యాధికారులు, జిల్లా అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ, ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, రెమిడిసివీర్ అవ‌స‌రాలపై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలించి త‌క్ష‌ణ ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌త్యేక క‌మిటిల‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హైద్రాబాద్ తర్వాత అత్య‌ధికంగా వివిధ జిల్లాల‌ నుంచి పేషంట్లు వ‌రంగ‌ల్ లోని యంజియం ఆసుపత్రితోపాటు, న‌గ‌రంలోని ప్రైవేటు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని, అందుకు త‌గిన విధంగా ముఖ్య‌మంత్రి కేసిఆర్ గారు ఆక్సిజ‌న్‌, రెమిడెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశించార‌ని మంత్రి తెలిపారు. తెలంగాణ‌ రాష్ట్రంలో 40 శాతం హైద్రాబాద్‌కు, 30 శాతం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు, 30 శాతం మిగ‌తా జిల్లాలకు ఇచ్చే విధంగా ముఖ్య‌మంత్రిగారు ఆదేశాలు జారీ చేశార‌ని మంత్రి తెలిపారు.

ప్రైవేటు అసుపత్రుల‌కు ప్ర‌తిరోజు ఒక వెయ్యి బ‌ల్స్ సిలిండ‌ర్ల ఆక్సిజ‌న్‌, చికిత్స పొందుతున్న బాధితుల‌కు సంఖ్య‌ను బట్టి ప్ర‌తిరోజు 1650 వ‌ర‌కు రెమిడిసివీర్ ఇంజ‌క్ష‌న్లను ప్ర‌భుత్వం స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని తెలిపారు. ప్ర‌తి మూడు రోజుల‌కు ఒక సారి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించుకుందామ‌ని, అప్ప‌టి వ‌ర‌కు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక సారి ప్ర‌త్యేక యాప్ ద్వారా న‌గ‌రంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆసుప‌త్రుల్లో చికిత్స‌కు అవ‌స‌ర‌మైన బెడ్ల వివ‌రాల‌ను పొందుప‌ర్చేందుకు కృషిచేయాల‌ని కోరారు. దీంతో చికిత్స కోసం వ‌చ్చే పేషంట్ల‌కు ఇబ్బందులు లేకుండా పూర్తి స‌మాచారం అందించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సూచించారు.

అవుట్ సోర్సింగ్ ద్వారా ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామ‌కానికి ఆదేశాలు జారీ చేసిన ముఖ్య‌మంత్రి కేసిఆర్‌, కోవిడ్ సేవ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించేవారికి ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని నిర్ణ‌యించార‌ని తెలిపారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో బాధితుల‌కు నిర్వ‌హిస్తున్న సిటి స్కానింగ్ ఫీజులు అధికంగా వ‌సూలు చేస్తున్నార‌న్న స‌మాచారంతో, ఫీజులు త‌గ్గించాల‌న్న విజ్ఞ‌ప్తికి స్పందించిన స్కానింగ్ సెంట‌ర్ల నిర్వ‌హాకులు 2 వేల‌కు స్కానింగ్ టెస్టులు చేసేందుకు ముందుకు రావ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని అన్నారు.

కోవిడ్ వ్యాప్తిని నివారించ‌డానికి రాష్ట్రంలో లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని, అందుకు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ విష‌యంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి స‌హ‌క‌రించ‌డంలేద‌న్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు గ్లోబ‌ల్ టెండ‌ర్ల ద్వారా వ్యాక్సిన్ కొనుగోలు చేసి ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తుంద‌ని అన్నారు. బిజేపి నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌కుండా, రాష్ట్రంలో కోవిడ్ బాధితుల‌కు అందుతున్న చికిత్స‌పై నేరుగా బాధితుల‌తో మాట్లాడాల‌ని సూచించారు. రాజ‌కీయాలు చేయ‌కుండా కోవిడ్ చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను, సిబ్బందిని ప్రోత్స‌హించాల‌ని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా జ‌రిగే విధంగా చూడాల‌ని హిత‌వు ప‌లికారు.

ప్రైవేటు ఆసుప‌త్రుల్లో అందిస్తున్న వైద్య సేవ‌ల‌ను మానిట‌రింగ్ చేసేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ చైర్మ‌న్‌గా, జిల్లా వైద్యాధికారితోపాటు, ఆర్డీఓ, డిసిపి, డిపిఓ, జిల్లా డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌భ్యులుగా క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఈ క‌మిటి ఎప్ప‌టిక‌ప్పుడు ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్‌, రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్ల స‌ర‌ఫ‌రా, కోవిడ్ చికిత్స‌కు అందుబాటులో బెడ్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌.. ఏ ఏ ట్రీట్‌మెంట్‌కు ఎంత ఫీజు వ‌సూలు చేస్తున్నార‌న్న అంశాల‌ను ప‌రిశీలించి రిపోర్ట్ ఇస్తారని తెలిపారు. ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్‌, రెమిడిసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని, కానీ బాధితుల నుంచి అధిక ఫీజులు వ‌సూలు చేస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

ఎంజీఎం ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల ఏర్పాటుకు స‌హ‌కరిస్తున్న ధాత‌ల‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాక‌తీయ యూనివ‌ర్సిటీ కెమిస్ట్రీ విభాగం క‌న్విన‌ర్, పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు స‌భ్యులు ప్రొఫెస‌ర్ వి.ర‌వింధ‌ర్ వారి మిత్ర బృందం స‌హాక‌రంతో యంజియం ఆసుప‌త్రికి జ‌ర్మ‌నీ మేడ్‌కు సంబంధించిన 2 బి పాప్ మిష‌న్లు, 3 పేషంట్ మానిట‌ర్‌ల‌ను అంద‌జేసినందుకు వారికి మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అమెరికా తెలుగు ఆసోసియేష‌న్ ( ఆటా ) వారు యంజియం ఆసుప‌త్రికి 50 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్‌లు, ఆక్సిజ‌న్ ఫ్లో మీట‌ర్లు అందించేందుకు ముందుకు వ‌చ్చార‌ని తెలిపారు.

ధాన్యం కొనుగోళ్ల‌లో రైతుల‌కు ఇబ్బందులు క‌లిగిస్తే మిల్ల‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు. ధాన్యం కొనుగోళ్ల‌లో రైతుల నుంచి త‌రుగు పేరుతో ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌న్న ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని, రైతుల‌ను ఇబ్బందులకు గురిచేసేవారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి ఆదేశించారు. మిల్లుల వ‌ద్ద ధాన్యం బ‌స్తాలు దించుకోకపోవ‌డంతో లారీలు, ట్రాక్ట‌ర్లు రోడ్ల‌పై బారులు తీరి క‌నిపిస్తున్నాయ‌ని, అధికారులు కో-ఆర్డినేట్ చేసుకుని ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాలని చెప్పారు. వ‌ర్షాలు వ‌చ్చే ప‌రిస్థితి ఉన్నందున తొంద‌ర‌గా లిఫ్టింగ్ చేసే విధంగా చూడాల‌ని, టార్పాలిన్ షీట్లు, గ‌న్నీ సంచులలో నింపే విధంగా చూసుకోవాల‌ని ఆధికారుల‌ను ఆదేశించారు. కాంటాలైన ధాన్యం సంచుల‌ను రావాణా జ‌రిగే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు బండా ప్ర‌కాష్‌, ఎమ్పీ ప‌సునూరి ద‌యాక‌ర్, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, గండ్ర వెంక‌ట‌రమ‌ణారెడ్డి, పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి, మేయ‌ర్ గుండు సుధారాణి, క‌లెక్ట‌ర్లు రాజీవ్‌గాంధీ హ‌నుమంతు, హ‌రిత‌, పోలీస్ క‌మీష‌న‌ర్ త‌రుణ్‌జోషి, జిల్లా వైద్యాధికారులు, యంజియం అధికారులు, జిల్లా అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.