కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తేలేదని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ప్రాజెక్టు వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు కోర్టు తీర్పు చెంప పెట్టు అన్నారు.
ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ సర్కారు ఇవ్వని రీతిలో బాధితులకు పరిహారం అందజేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వాసితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుందని చెప్పారు. ఇప్పటికైనా విపక్షాలు బుద్ది తెచ్చుకోవాలని రాజకీయాల కోసం నిర్వాసితులను రెచ్చగొట్టడం మానుకోవాలని సూచించారు..
మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగగా కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. పరిహారం తీసుకోవడానికి నిరాకరించిన 60 మంది నిర్వాసితుల పరిహారాన్ని వారి లాయర్లకు అందజేయాల్సిందిగా ఆదేశించింది.