మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటానని ఆనాడు మీరు ఏటిగడ్డ కిష్టాపూర్లో నిరాహారదీక్ష చేపట్టారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున ఆ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మీపై ఉందని, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 90 శాతం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణం, ఇంటి స్థలాలు, మౌళిక సౌకర్యాలను కల్పించడం జరిగింది. మిగిలిన 10శాతం సమస్యలు గత ఏడాది కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ వ్రాసారు.
నిరాహారదీక్ష చేసిన మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నిర్వాసితులు మీపైనే ఆశలు పెట్టుకున్నారని పెండింగ్ సమస్యల పరిష్కారంతోపాటుగా మరింత మెరుగైన సౌకర్యాలు, మెరుగైన పరిహారాన్ని అందిస్తారని ఎదురుచూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.. నిర్వాసితుల తరపున వారి సమస్యలను మీ దృష్టికి తెస్తున్ననన్నారు.. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2013 భూసేకరణ చట్టంతో నిర్వాసితులకు 121 గజాల ఇంటి స్థలం, ఒక లక్షా 25వేల రూపాయలు మాత్రమే అందించాలనే నిబంధన ఉంది. లక్షలాది మంది రైతుల కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వడానికి గౌరవ కేసీఆర్ గారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయని విధంగా మెరుగైన ప్యాకేజీని మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం నాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు అమల్లోకి తెచ్చారని చెప్పారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్రతీ నిర్వాసితుడికి గజ్వేల్ పట్టణ సమీపంలోనే 250 గజాల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి 5.04 లక్షల రూపాయలు, 7.50లక్షల పరిహారం అందజేశామన్నారు. 18ఏళ్ల వయసు నిండిన ప్రతీ ఒక్కరకి 5లక్షల రూపాయల పరిహారం, 250గజాల ఇంటి స్థలం కేటాయించడం జరిగిందని వీటితోపాటు పాత ఇండ్ల నిర్మాణ స్ట్రక్చర్కు కూడా సరైన లెక్క కట్టించి పరిహారం ఇచ్చాము. ప్యాకేజీతోపాటు నిర్వాసితులకు వారి గ్రామాల పేరిట ఆర్అండ్ఆర్ కాలనీలను నిర్మించి బిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగేవరకు దాదాపుగా అన్ని వసతులను దశలవారీగా సమకూర్చడం జరిగింది. ఇందుకోసం 1260 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్వాసితులకు అత్యంత ప్రాధాన్యతను కల్పించాము. ఈ నిధులతో 90శాతం పనులను చకచకా పూర్తిచేయడం జరిగింది. మిగితా 10శాతం పనులతో పాటు కోర్టు కేసుల్లో తీర్పు వచ్చినవారికి, అక్కడక్కడ ప్యాకేజీ మిస్సయినవారికి పరిహారం అందించాల్సి ఉంది. ప్రభుత్వం మారిన క్రమంలో ఆ మిగితా పనులను పూర్తి చేయలేకపోయాం. ముంపు గ్రామాలకు చెందిన వితంతువులను కూడా కుటుంబంగా పరిగణించి వారికి ప్యాకేజీ ఇవ్వాలని ఇటీవల గౌరవ హైకోర్టు తీర్పు వెల్లడించింది. వెంటనే వితంతువులకు పరిహారం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. లక్షలాది ఎకరాలకు సాగునీటితోపాటు హైదరాబాద్ సహ అనేక ప్రాంతాలకు తాగునీటి కష్టాలను తీరుస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వెనుక నిర్వాసితుల త్యాగాలు ఉన్నాయి.
Also Read:ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ !
మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రిజర్వాయర్ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. హైదారాబాద్ తాగునీటి అవసరాలతో పాటు మూసి నదిలో గోదావరి జలాలను తరలించడానికి మీరు మల్లన్నసాగర్ పై ఆధారపడ్డారు. ఇక్కడి నుంచే 20 టిఎంసిల నీటిని హైద్రాబాద్ తరలించేందుకు టెండర్ల ప్రక్రియ కూడా చేపడుతున్నట్లు తెలుస్తున్నది. ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని.. కాళేశ్వరంతో ప్రయోజనం లేదని మీరు స్వయంగా విమర్శలు చేశారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నీళ్ళ కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు.
ఆనాడు మీరు నిరాహారదీక్ష చేపట్టిన సమయంలో మా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నాడు మేము తక్కువ పరిహారం ఇచ్చామని మీరు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎక్కువ పరిహారం ఇచ్చి నిర్వాసితుల దగ్గర మీ మాట నిలబెట్టుకోవాలి . నిరాహారదీక్ష పేరిట ఆనాడు మీరు చేసింది రాజకీయమా.. న్యాయ పోరాటమా.. అనేది మీ నిర్ణయాన్ని బట్టి తేలిపోతుంది. ప్రతిపక్షంలో మాట్లాడిన మాటలను అధికారంలోకి రాగానే విస్మరించినట్లు అవుతుందన్నారు..
కావున మల్లన్న సాగర్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న మీరు.. ఆ మల్లన్నసాగర్ నిర్వాసితుల పరిస్థితిని మానవతాధృక్పథంతో అర్థం చేసుకొని ఒక ముఖ్యమంత్రిగా వారిని ఆదుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు..

