2020 – 2021విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సు ఆన్ లైన్ అడ్మిషన్ల ప్రక్రియను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అరణ్య భవన్‌లో అడ్మిషన్ బ్రోచర్, పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు. అటవీ యాజమాన్యంలో విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఎఫ్‌సీఆర్ఐ ను ప్రారంభించారన్నారు. కళాశాల ప్రారంభించిన అనతి కాలంలోనే ఇక్కడ చదువుతున్న విద్యార్థులు దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సాధించడం గొప్ప విషయమన్నారు. ఫారేస్ట్రీ కోర్స్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఎఫ్‌సీఆర్ఐ కృషి చేయడం అభినందనీయమన్నారు.
ఎఫ్ సీఆర్ఐ డీన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందించి విద్యా బోధన కొనసాగిస్తున్నామన్నారు. ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సు మొదటి బ్యాచ్ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందని, అర్హత గల విద్యార్థులు www.tsfcri.in వెబ్ సైట్‌లో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 23 వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 26 నుంచి ఆన్ లైన్‌లో క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండేళ్ళ ఈ కోర్సులో 5 విభాగాల్లో 24 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, తదితరులు పాల్గొన్నారు.