నిరుద్యోగ భారతం…రోజుకు 550 ఉద్యోగాలు మాయం

297
- Advertisement -

నిరుద్యోగం … యువతరాన్ని వెంటాడుతున్న సమస్య! చదువుకు తగ్గ ఉద్యోగం సంగతి అలా ఉంచితే, ఏదో ఒక ఉపాధి దొరికితే చాలని కాళ్లరిగేలా తిరుగుతున్న యువకులు ఎందరో..! ఇంజినీరింగ్‌లు, పిజీలు చేసిన వారు కూడా కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం, వాచ్‌మెన్ల పోస్టుల కోసం బారులు తీరారన్న వార్తలు తరచు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ముందు నేతలు ఇచ్చే హామీలు ఎలా ఉన్నప్పటికీ, అధికారంలోకి వచ్చాక శూన్య హస్తాలే చూపుతుండటంతో నిరుద్యోగ సైన్యం ఏటికేడాది పెరుగుతోంది.

కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత దేశాన్ని స్మార్ట్ సిటీల దిశగా పరుగులు తీయించాలని కలలుగంటున్నారు. ఆ దిశగా కేంద్రం ప్రణాళికలు రూపొందించి అడుగులు వేస్తోంది కూడా. మరోవైపు… దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. జాబ్‌ దొరక్క..దొరికినా అది నిలబడడం చాలా కష్టంగా మారింది. కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఇప్పటికే చాలా కంపెనీల్లో.. సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. నిజంగానే.. నిరుద్యోగం కల్లోలం సృష్టించే రోజులు రాబోతున్నాయా? అంటే.. అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉద్యోగాలు దొరకడం చాలా కష్టమని ఢిల్లీకి చెందిన ఓ సంస్థ కళ్లు చెదిరే వాస్తవాలను యువత ముందుంచింది.

Unemployment-in-India

చదువులు పూర్తి కాగానే జాబ్‌ చేయాలనేది చాలామంది కల. యువత అత్యధికంగా ఉన్న భారత్‌లో అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయా? అంటే కష్టమనే చెప్పాలి. లేబర్ బ్యూరో విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015 సంవత్సరంలో దేశంలో కేవలం 1.35 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. అదే 2013లో 4.19 లక్షలు, 2009లో 9 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించారు. దేశంలో పౌరుల జీవన ప్రమాణాలు పెరగాల్సిందిపోయి తరగిపోతున్నాయని, ఉద్యోగాలు సృష్టించే ప్రక్రియ చాలా మందగించింది’అని ప్రహర్ సర్వేలో తెలిపారు. రోజుకు 550 ఉద్యోగాలు మాయం అవుతున్న విషయాన్ని లేబర్ బ్యూరో కూడా నిర్ధారించిందని ప్రహర్ రిపోర్టు తెలిపింది.

2011 లెక్కల ప్రకారం 121 కోట్ల జనాభాలో 50 శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలో కలిపి ఉద్యోగాల సంఖ్య 47 కోట్లు. అయితే… ప్రస్తుతం వ్యవసాయ, రిటైల్, నిర్మాణ రంగాలతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిర్మాణ కార్మికులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయా రంగాల్లో రోజుకు 550 ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయి. ఆ లెక్కన 2050నాటికి దేశంలో 70 లక్షల ఉద్యోగాలు మటుమాయం కానున్నాయి. 2050 నాటికి మనదేశ జనాభా 180 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ వివరాలన్నీ ఢిల్లీకి చెందిన సామాజిక సంస్థ ప్రహర్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కళ్లు చెదిరే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి.

unemployed

భారతదేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పునర్జీవనం కల్పిస్తే తప్ప పరిస్థితులు చక్కబడవని, ఆ మేరకు అన్ని రాష్ర్ట ప్రభుత్వాలు దృష్టిసారించాలని సామాజిక అధ్యయన సంస్థ సూచించింది. 21వ శతాబ్దపు ఇండియాకు స్మార్ట్ సిటీలకన్నా స్మార్ట్ విలేజ్ ల అవసరం ఉందని అభిప్రాయపడింది.

- Advertisement -