ఆగస్టులో శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు సన్నాహకాల్లో ఒక మార్పు చోటుచేసుకుంది. స్థానిక శ్రీలంక XI జట్టుతో భారత్ ఆడవలసిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌ను మూడు రోజుల గేమ్‌గా కుదించారు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఆగస్టు 7 నుండి 9 వరకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొంటుంది. అనంతరం ఆగస్టు 15 నుండి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఈ మార్పు గురించి బిసిసిఐ (BCCI) మరియు భారత జట్టు యాజమాన్యానికి సమాచారం అందించినప్పటికీ, నిర్దిష్ట కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్‌కు సమీపంలో ఉన్న NCC మైదానంలో ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుండటం విశేషం. సిరీస్ ప్రారంభానికి ముందు శ్రీలంకలోని స్పిన్‌కు అనుకూలించే పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు గిల్ సేనకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఎంతో కీలకమైనదిగా మారనుంది.
గతేడాది స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో టెస్ట్ సిరీస్ ఓటమి పాలైన భారత్‌కు.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2027 ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై విజయం సాధించడం అత్యంత ముఖ్యం.తొలి టెస్టు ఆగస్టు 15 నుండి, రెండో టెస్టు ఆగస్టు 19 నుండి ప్రారంభం కానున్నాయి.
దాదాపు దశాబ్దం తర్వాత భారత్ శ్రీలంకలో ఆడుతున్న తొలి టెస్టు పర్యటన ఇది కావడం గమనార్హం. భారత్ చివరిసారిగా 2017లో అక్కడ టెస్ట్ సిరీస్ ఆడింది. అలాగే 2008 తర్వాత శ్రీలంక ఇప్పటివరకు భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలవలేదు.
WTC 2025-27 సైకిల్‌లో భారత్‌కు ఇంకా తొమ్మిది టెస్టులు మిగిలి ఉన్నాయి. శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్ తర్వాత, 2026 చివరిలో మరో రెండు టెస్టుల కోసం భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఆ తర్వాత 2027 ప్రారంభంలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
Also Read:‘ది ప్యారడైజ్’..టీజర్ అప్‌డేట్
శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ జైన్.

