భారతదేశం తన మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ (QDENGA) కి అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి….ఎవరు తీసుకోకూడదు…రెండు డోసులు ఎందుకు అవసరం మరియు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా దోమల నివారణ ఎందుకు ముఖ్యమో నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ డెంగ్యూ నుంచి రక్షణ అందించినప్పటికీ ఇది దోమల నివారణకు లేదా సమయానికి తీసుకునే వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
క్యూడెంగా అనేది డెంగ్యూ వైరస్‌కు చెందిన నాలుగు రకాల నుండి రక్షణ కల్పించడానికి రూపొందించబడింది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఒక రకం డెంగ్యూ నుంచి కోలుకున్నంత మాత్రాన మిగిలిన మూడు రకాల నుండి పూర్తి రక్షణ లభించదు. అంటే ఒక వ్యక్తికి ఒకరి కంటే ఎక్కువసార్లు డెంగ్యూ రావచ్చు. ఈ వ్యాక్సిన్‌ను రెండు డోసులలో సాధారణంగా మూడు నెలల వ్యవధితో ఇస్తారు. పూర్తిస్థాయి రక్షణ సాధించడానికి సూచించిన విధంగా రెండు డోసులను పూర్తి చేయడం చాలా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు.
ఈ వ్యాక్సిన్ 100% పూర్తి రక్షణ ఇస్తుందా? అంటే లేదనే చెప్పాలి . ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తికి కూడా డెంగ్యూ సోకే అవకాశం ఉంది. అయితే డెంగ్యూ తీవ్రరూపం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ముందస్తు జాగ్రత్తలు కొనసాగించాల్సిందే.
ప్రజలు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి:
కూలర్లు, పూల కుండీలు, టైర్లు మరియు ఇతర పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
దోమల నివారణ మందులు (Repellents) ఉపయోగించాలి.
శరీరం పూర్తిగా కప్పేలా చేతుల నిండా దుస్తులు ధరించాలి.
దోమలు లోపలికి రాకుండా తలుపులు, కిటికీలకు నెట్లు (Mesh) అమర్చుకోవాలి.
ఈ వ్యాక్సిన్ ద్వారా డెంగ్యూకి చికిత్స చేయవచ్చా?
ఈ వ్యాక్సిన్ కేవలం ముందస్తు నివారణకు మాత్రమే. ఇప్పటికే డెంగ్యూ ఉన్న వ్యక్తికి ఇది చికిత్స చేయలేదు.
అధిక జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, వాంతులు, కడుపునొప్పి, రక్తస్రావం, తీవ్రమైన బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తీవ్రమైన నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ జైన్ సూచించారు.
అలాగే వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని ఆమె హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ వెంటనే వ్యాక్సిన్ వేసుకోవాలా?
అవసరం లేదు.
డెంగ్యూ తీవ్రత, స్థానిక వ్యాప్తి, వ్యాక్సిన్ లభ్యత మరియు భద్రతా ప్రమాణాల ఆధారంగా ఏ వయో వర్గాలకు మరియు ఏ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలో ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయిస్తారని డాక్టర్ జైన్ వివరించారు.
ప్రజలు సొంతంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి బదులుగా, ఈ వ్యాక్సిన్ తమకు తగినదో కాదో తెలుసుకోవడానికి ముందుగా వైద్యుడిని సంప్రదించాలి.
Also Read:ఢిల్లీ నిరసనలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
డెంగ్యూ వ్యాక్సిన్‌ను ఎవరు తీసుకోకూడదు?
క్యూడెంగా అనేది ఒక ‘లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్’ (Live Vaccine) కాబట్టి ఇది అందరికీ తగినది కాకపోవచ్చు.
గర్భిణులు
పాలు ఇచ్చే తల్లులు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు
రోగనిరోధక వ్యవస్థను అణచివేసే చికిత్సలు (Immune-suppressing therapy) తీసుకుంటున్నవారు
గతంలో వ్యాక్సిన్ల వల్ల తీవ్రమైన అలెర్జీ సమస్యలు ఎదుర్కొన్నవారు
భారతదేశపు మొదటి డెంగ్యూ వ్యాక్సిన్‌కు అనుమతి లభించడం ప్రోత్సాహకరమైన పరిణామమే అయినప్పటికీ ఇది అలసత్వానికి దారితీయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

