ఆసియా హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ నిర్వహించిన మహిళల ప్రెసిడెంట్ కప్ టైటిల్‌ను భారత అమ్మాయిలు జట్టు మొట్టమొదటిసారిగా నెగ్గి చరిత్ర సృష్టించారు. ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు జోర్డాన్‌లో ఈ పోటీలు జరిగాయి. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో కెప్టెన్ శైలజ శర్మ నాయత్వంలోని భారత్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. తొలుత కువైట్‌తో తలపడిన భారత్ మొదటి మ్యాచ్‌లో 41-15, రెండో మ్యాచ్‌లో 40-12తో ఘన విజయాలు సాధించింది. అనంతరం ఇరాక్‌ను ఢీకొట్టిన భారత్ తొలి పోరులో 31-27, రెండో మ్యాచ్‌లో 28-20తో అద్భుత విజయాలను అందుకుంది. ఇక, ఆతిథ్య జోర్డాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 37-21తో జయకేతనం ఎగురవేసిన భారత్, ఉత్కంఠభరితంగా సాగిన ద్వితీయ మ్యాచ్‌లో 28-21తో గెలుపొందింది. మూడు జట్లతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయదుందుభి మోగించిన భారత్ ఓవరాల్‌గా 12 పాయింట్లతో ట్రోఫీని ముద్దాడింది. జోర్డాన్ 8 పాయింట్లతో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
తెలంగాణ నుంచి జాతీయ హ్యాండ్‌బాల్ అధ్యక్షుడిగా తొలిసారిగా ఎన్నికైనప్పుడే భారత జట్టును ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నానని జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు చెప్పారు. గత రెండేళ్లలో జాతీయ స్థాయిలో హ్యాండ్‌బాల్‌లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టమని అన్నారు. టీమ్ సన్నద్ధతలో అన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోని అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేసి హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్స్‌క్లూజివ్ ట్రైయినింగ్ ఇస్తున్నామని వివరించారు. వాటి ఫలితంగా గత ఏడాది తొలిసారిగా ఆసియా మహిళల జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రెసిడెంట్ కప్‌ను దక్కించుకున్నామని చెప్పారు. ఇక్కడి నుంచి ఒలింపిక్స్ దిశగా అడుగులు వేయడానికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని జగన్మోహన్ రావు అన్నారు.
దేశానికి తొలిసారి ప్రెసిడెంట్ కప్‌ను తీసుకొచ్చిన భారత అమ్మాయిలను గురువారం న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన వేడుకలో జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు సత్కరించారు. అత్యంత విలువైన ప్లేయర్ అవార్డు దక్కించుకున్న నిధి శర్మ, ఉత్తమ గోల్‌కీపర్ అవార్డు అందుకున్న దీక్ష ఠాకూర్‌ను జగన్ మోహన్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనందీశ్వర్ పాండే, చీఫ్ కోచ్ సచిన్ చౌధురి, టీమ్ మేనేజర్ పరమెందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..