ఎలాన్‌ మస్క్ ఆరోపణలపై భారత్‌

1
- Advertisement -

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కాకుండా కొందరు అడ్డుకుంటున్నారన్న అమెరికా బిలియనీర్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించి అందరికీ సమానమైన, ఎలాంటి వివక్షకు తావులేని అనుమతి విధానం అమల్లో ఉందని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత శాటిలైట్ కమ్యూనికేషన్ నియంత్రణ విధానంపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది.

మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు అవసరమైన కీలక లైసెన్సులు పొందినప్పటికీ, తుది అనుమతులు మాత్రం ఇంకా పూర్తికాలేదు. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు అవసరమైన GMPCS లైసెన్సులు, ఇతర చట్టబద్ధ అనుమతులు ప్రస్తుతం మూడు సంస్థలకు మంజూరయ్యాయి.

వాటిలో స్టార్‌లింక్‌తో పాటు భారతి గ్రూప్ మద్దతు ఉన్న యూటెల్‌సాట్ వన్‌వెబ్, జియో ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. అమెజాన్ లియో కూడా లైసెన్స్ కోసం పోటీలో ఉంది.

లైసెన్స్ నిబంధనల ప్రకారం ప్రతి సంస్థ భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. వినియోగదారులు, వారి డేటా భద్రతను నిర్ధారించేందుకే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం మూడు లైసెన్స్ పొందిన సంస్థలకు సంబంధించి భద్రతా పరిశీలన కొనసాగుతోందని పేర్కొంది.

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత సంస్థలు స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం తదుపరి దశకు వెళ్లవచ్చని కేంద్రం వివరించింది. ప్రస్తుతం మూడు సంస్థలు దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయని స్పష్టం చేసింది.

Also Read:దుబాయ్‌ బతుకమ్మ వేడుకలకు బీఆర్‌ఎస్‌ బృందం

ఇదిలా ఉండగా, మస్క్ వ్యాఖ్యలకు కొన్ని గంటల ముందే స్పేస్‌ఎక్స్ సీనియర్ అధికారి లారెన్ డ్రేయర్ భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో ఆమె మాట్లాడుతూ.. భారత భద్రతా నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు.

- Advertisement -