ప్రజాస్వామ్యానికి భారతదేశమే తల్లి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేటి ప్రపంచంలో సాంకేతికత, డేటా, విజ్ఞానం, ఆవిష్కరణలు కీలకమైన శక్తులుగా మారాయని పేర్కొన్నారు. అయితే, ఆ శక్తులను ఎవరు కలిగి ఉన్నారన్నది కాకుండా.. వాటిని ఎలా వినియోగిస్తున్నారన్నదే అసలైన ప్రశ్న అని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మంగళవారం ఆయన మాట్లాడారు.
నేడు సాంకేతికత, డేటా, విజ్ఞానం, ఆవిష్కరణలు శక్తులుగా ఉన్నాయి. అయితే, అసలు ప్రశ్న ఆ శక్తి ఎవరి చేతుల్లో ఉందన్నది కాదు.. దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే. సాంకేతికత కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందా? లేక లక్షలాది మందికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందా? విజ్ఞానం కొద్దిమంది సామర్థ్యానికే పరిమితమవుతుందా? లేక ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని పెంచుతుందా? అని మోదీ ప్రశ్నించారు.
ఈ ఆలోచన నుంచే ‘పవర్ టు ఎంపవర్’ (శక్తితో అందరినీ సాధికారులుగా మార్చడం) అనే కొత్త భావన పుట్టుకొస్తుందని వివరించారు. 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం…ప్రభుత్వానికి అధికారం ఉంటుందని, అయితే ప్రజలను వ్యవస్థపై ఆధారపడేలా చేయడం దాని ఉద్దేశం కాకూడదని మోదీ అన్నారు. ప్రజలను బలోపేతం చేసి, వారి సామర్థ్యాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.
ఈ మార్గంలోనే భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగామని చెప్పారు. ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువని వివరించారు. ప్రజలకు అవకాశాలు కల్పించడం, వారి సామర్థ్యాలను పెంచడం ద్వారా దేశ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Also Read:కిమ్ జోంగ్ ఉన్‌తో ట్రంప్ భేటీ!

