సత్తాటిన భారత బౌలర్లు.. ఆసీస్ 191 ఆలౌట్..

79
india

అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న అడిలైడ్ పిచ్ పై రవిచంద్రన్ అశ్విన్ 4, ఉమేశ్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లతో ఆతిథ్య ఆసీస్ పనిబట్టారు. దాంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్ కు కీలకమైన 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ పృథ్వీ షా(4) మళ్లీ తన పేలవఫామ్‌ను కొనసాగించాడు. పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌన్‌లో బుమ్రా నైట్‌వాచ్‌మన్‌గా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం మయాంక్‌ అగర్వాల్‌(5), బుమ్రా(0) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 62 ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఈరోజు ఉదయం సెషన్ లో ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభం కాగా, ఆద్యంతం టీమిండియా బౌలర్ల హవా కొనసాగింది. కెప్టెన్ టిమ్ పైన్ తప్ప భారత బౌలర్లను సాధికారికంగా ఎదుర్కొన్న ఆసీస్ ఆటగాడే కనిపించలేదు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో‌ కెప్టెన్‌ టిమ్ పైన్ (73) ఒంటరి పోరాటం చేశాడు. మరో బ్యాట్స్ మెన్ లబుషేన్‌ (47) రాణించాడు. టీమిండియా ఫీల్డింగ్ నాసిరకంగా ఉండటంతో ఆస్ట్రేలియా ఈ మాత్రం స్కోరైనా చేసింది. లేకపోతే ఆస్ట్రేలియా టీమ్ ఎప్పుడో ఆలౌట్ అవ్వాల్సి ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తడబడుతున్నా.. ఆ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఎక్కడా తడబాటు కన్పించలేదు. చివరికి 73 పరుగులతో టిమ్ అజేయంగా నిలిచాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం లభించింది.