‘బాహుబలి’ సినిమాలో శివలింగాన్ని ప్రభాస్ ఎత్తుకుంటే..ఇక్కడ రియల్ గజేంద్రున్ని శరత్‌కుమార్ ఎత్తుకున్నాడు. శరత్ హీరోకాదు. ఫారెస్ట్ గార్డు. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన హీరో అయిపోయాడు. మంత్రి కేటీఆర్ సైతం ఇతనే నిజమైన బాహుబలి అంటూ కితాబిచ్చారు కూడా. ఇంతకీ శరత్ కుమార్ ఒక్కసారిగా అందరి ప్రశంలు అందుకోడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయన పేరు పళనిచామీ శరత్‌కుమార్. తమిళనాడులో ఫారెస్ట్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. గత వారం ఓ ఏనుగు పిల్ల అడవిలో లోయలో పడిపోయింది. అయితే ఆ ఏనుగు పిల్ల తల్లి అటవీ ప్రాంతంగా గుండా వెళ్లే రోడ్డు మార్గంపై అడ్డుగా నిల్చుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
కొందరు వ్యక్తులు ఏనుగును రోడ్డు మార్గం నుంచి తరిమేందుకు ప్రయత్నించగా.. గుంతలో పడి ఉన్న గున్న ఏనుగు కనిపించింది. వారు ఫారెస్టు సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శరత్..తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లను భుజాలపై మోసుకుని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాడు. అనంతరం తల్లి చెంతకు చేర్చారు.
అయితే…అతను పిల్లని ఎత్తుకుని తీసుకెళుతున్న ఫొటో సోషల్‌మీడియాలోకి రావడంతో వైరల్‌గా మారింది. అందరూ తన కంటే బరువుగా ఉన్న ఏనుగు పిల్లను ఎలా మోసుకెళ్లావు అని ప్రశ్నిస్తున్నారని కుమార్ తెలిపాడు.
కాగా..తాజాగా ఈ ఫొటోపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. ‘ఇతనే అసలైన బాహుబలి’అంటూ ఫొటోను పోస్ట్ చేశారు.