గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆ దేశంలో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్రం తరఫున విదేశాంగ మంత్రి జై ఎస్ జైశంకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొనగా.. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ శ్రీలంకలో పరిస్థితులు విషమంగా ఉన్నాయని, దీనిపై భారత్ ఆందోళన చెందుతోందన్నారు. ఇప్పటి వరకూ భారత్ శ్రీలంకకు 3.8 బిలియన్ డాలర్స్ ఆర్ధిక సహాయం చేశామని…ఇంత విపత్కర పరిస్థితులలో మరే దేశం,అంతర్జాతీయ సంస్థలు కూడా సహయం చేయలేదన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. సంక్షోభం సహజంగానే భారత్‌ను కలవరపెడుతుందన్నారు. అయితే, పొరుగుదేశంలో ఉన్న పరిస్థితులు భారత్‌లో తలెత్తే అవకాశాలు లేవన్నారు. ఈ విషయంలో కొంత తప్పుడు సమాచారంతో కూడిన పోలికలు కనిపిస్తున్నాయన్నారు. భారత్‌లో అలాంటి పరిస్థితి ఏర్పడుతుందా? అని కొందరు తనను అడిగారన్నారు.
ఈ సమావేశంలో 46 వివిధ పార్టీలు ఆహ్వానం అందగా 28 పార్టీలు మాత్రమే వచ్చాయని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు పి చిదంబరం, మాణికం ఠాగూర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్, ద్రవిడ మున్నేట్ర కజగం నేత చెందిన టీఆర్ బాలు, ఎంఎం అబ్దుల్లా, ఎం తంబిదురై (అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం) హాజరయ్యారు. సౌగత రాయ్ (తృణమూల్ కాంగ్రెస్), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), సంజయ్ సింగ్ (ఆమ్ ఆద్మీ పార్టీ), కేశవరావు (టీఆర్‌ఎస్) రితేష్ పాండే (బహుజన్ సమాజ్ పార్టీ), విజయసాయి రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్) తదితరులు హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా విదేశీ మారకద్రవ్యం అడుగంటడంతో శ్రీలంక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, ఇంధనం, ఔషధాలతో సహా నిత్యావసర వస్తువుల దిగుమతికి ఆటంకం కలుగుతున్నది. సంక్షోభం మధ్య ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో తాత్కాలిక రణిల్ విక్రమసింఘే దేశంలో అత్యవస పరిస్థితి ప్రకటించారు.