ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లలోనూ భారత జట్టు తుది ఆటగాళ్ల జాబితా (టీమ్‌షీట్)పైనే అందరి కళ్లూ నిలిచాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎప్పుడు అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతగానో నిరీక్షించారు. కానీ భారత్ ఘోర పరాజయం పాలైన ఈ రెండు మ్యాచ్‌ల తుది జట్టులో ఈ టీనేజ్ స్టార్‌కు చోటు దక్కలేదు.
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ చారిత్రాత్మక అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోవడం భారత అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. యూకే పర్యటనకు భారత్ జట్టును ప్రకటించినప్పటి నుండి ఈ 15 ఏళ్ల కుర్రాడిపైనే అందరి దృష్టి ఉంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్‌లో మెరిసిన ఈ యువ ఆటగాడు.. భారత్ క్యాప్ సాధిస్తాడని అంతా భావించారు.
అయితే, బెల్‌ఫాస్ట్‌లో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ మేనేజ్‌మెంట్ ప్రపంచకప్ ఓపెనింగ్ జోడీ అయిన అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లకే ప్రాధాన్యత ఇచ్చింది. ఐర్లాండ్ చేతిలో భారత్ 2-0తో అవమానకరమైన ఓటమిని చవిచూసిన తర్వాత, సూర్యవంశీ తుది జట్టులో ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కేవలం ఓపెనర్లు మాత్రమే కాదు ఈ సిరీస్‌లో భారత బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమైంది.
సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోస్కాటే స్పందించారు. మిగిలిన ఆటగాళ్లలాగే అతను కూడా తన అవకాశం కోసం వేచి చూడక తప్పదని స్పష్టం చేశారు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యవంశీ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అతను (సూర్యవంశీ) అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మూడు నెలల క్రితం మనకు ప్రపంచకప్ అందించడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడనే విషయాన్ని మరువకూడదు అన్నారు.
సంజు ఐపీఎల్‌లో కూడా బాగా రాణించాడు. ఆటగాళ్లకు నమ్మకాన్ని ఇవ్వడం మరియు జట్టులో వారికి సుదీర్ఘమైన అవకాశాలు కల్పిస్తామనే సందేశాన్ని పంపడం చాలా ముఖ్యం. వైభవ్ ఆటను చూడాలని మాకు కూడా ఆత్రుతగా ఉంది, కానీ అతను కూడా మిగతా వారిలాగే ఒక ప్రక్రియ (ప్రాసెస్) ద్వారా రావాలి. అతని ప్రతిభపై మాకెలాంటి అనుమానాలు లేవు అని ర్యాన్ టెన్ డోస్కాటే చెప్పారు.
Also Read:రేవంత్ మాట్లాడితే బూతుల కంపే!

