పసికూన ఐర్లాండ్‌పై కోహ్లీ సేన పంజా విసిరింది. తొలి టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. భారత బ్యాట్స్ మెన్ ధాటికి ఐర్లాండ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ధావన్,రోహిత్ భారీ షాట్లతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. గ్రౌండ్ నలువైపులా బంతిని పరుగులు పెట్టిస్తూ ఐర్లాండ్‌కు చుక్కలు చూపించారు.
209 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. స్పిన్నర్లు కుల్దీప్,చాహల్ ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను కొలుకొనివ్వలేదు. కుల్దీప్ 4 వికెట్లు తీయగా చాహల్ 3 వికెట్లు తీశారు. ఓపెనర్ జేమ్స్ 35 బంతుల్లో 60(5*4,4*6)మాత్రమే చెప్పుకొదగ్గ స్కోరు చేశాడు. దీంతో ఐర్లాండ్ 132/9 పరుగులకే పరిమితమైంది.
తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలిరెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన రోహిత్,ధావన్ తర్వాత తమ విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా ధావన్ కేవలం 27 బంతుల్లో అర్థసెంచరీ సాధించగా రోహిత్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ శర్మ (97; 61 బంతుల్లో 8×4, 5×6), శిఖర్ ధావన్ (74; 45 బంతుల్లో 5×4, 5×6) విధ్వంసం సృష్టించచారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది.రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి 8.30 గంటలకి జరగనుంది.