సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు ఓటేసేందుకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.
ఐదో దశ ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ తదితరులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలకు పోలింగ్ జరుతోంది. రాయ్‌బరేలీ నుండి రాహుల్, అమేథీ నుండి స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్న లక్నో స్థానాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులు కౌశల్ కిశోర్(మోహన్‌లాల్ గంజ్), సాధ్వి నిరంజన్ జ్యోతి(ఫతేహ్‌పూర్), భానుప్రతాప్ సింగ్ వర్మ(జలౌన్) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Also Read:కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్..