జయలలిత మరణం తర్వాత.. తమిళ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. అయితే..రజినీ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అయిన నేపథ్యంలో తమిళ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ఇదే క్రమంలో తాను కూడా రాజకీయాల్లోకి రావాలనకుంటున్నట్టు సంకేతాలిచ్చిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఎట్టకేలకూ పొలిటికల్ ఎంట్రీకి ఫిక్సైపోయాడు. ఈ క్రమంలోనే రాజకీయ అరంగ్రేటంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు కమల్ హాసన్.
పార్టీ ప్రకటన కంటే ముందే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు కమల్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తమిళనాడులో ప్రస్తుతం అవినీతి పాలన నడుస్తోంది. ప్రస్తుత పరిణామాలను ప్రజలకు వివరించి.. వారి సమస్యలను తెలుసుకునేందుకే నా పర్యటన. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా. పర్యటన వివరాలను ఆనంద్ వికటన్ తదుపరి సంచికలో వెల్లడిస్తా’’ అని కమల్ పేర్కొన్నాడు.
మైయామ్ విజిల్ యాప్ ద్వారా ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయని.. త్వరలోనే అవినీతి తిమింగలాల బండారం బయటపెడతానని ఆయన అన్నారు. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై 63 ఏళ్ల కమల్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించాడు.