తెలంగాణలో నేడు,రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, వాయవ్య బంగాళాఖాతంలో 2.2 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు మరొకటి ఏర్పడింది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల రెండురోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడురోజులు గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రధానంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.