తన పాలన కాలంలో అక్రమాలు, అవినీతి, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించబోనని తమిళనాడు సీఎం, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. అవి పెరిగితే తాను నియంతలా మారతానని వార్నింగ్ ఇచ్చారు. నమక్కల్‌లో సోమవారం జరిగిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి సీఎం స్టాలిన్ మాట్లాడారు.
‘నేను చాలా ప్రజాస్వామ్యంగా మారానని నా సన్నిహితులు అంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే అందరి అభిప్రాయాలు వినడం, గౌరవించడం. ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా ఏమైనా చేయడం అని కాదు. నేను అలా మారలేదు. కానీ క్రమశిక్షణా రాహిత్యం, అకృత్యాలు పెరిగితే నేను నియంతగా మారి చర్యలు తీసుకుంటా. ఈ విషయాన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే కాదు అందరికి చెబుతున్నా’ అని హెచ్చరించారు.
కాగా, ప్రజల కోసం చట్టం ప్రకారం నడుచుకోవాలని ప్రజా ప్రతినిధులకు సీఎం స్టాలిన్ సూచించారు. చట్టాన్ని పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే తమ బాధ్యతలను భర్తలకు అప్పగించవద్దని మహిళా ప్రతినిధులకు స్పష్టం చేశారు.