అభిరామ్ సమర్పణలో రామ్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా రమేష్‌గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ నిర్మిస్తోన్న చిత్రం `ఇది నా లవ్‌స్టోరీ`. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా..
హీరో తరుణ్ మాట్లాడుతూ – “టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకల హృదయాలను హత్తుకునేలా ఈ బ్యూటీఫుల్ లవ్ స్టోరీని రమేష్‌గోపి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీనాథ్ విజయ్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. ఆయన అందించిన సాంగ్‌ను రేడియో సిటీలో విడుదల చేశాం. పాటలు బాగా వచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్స్‌ట్రార్డినరీగా కుదిరింది. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మా ప్రయత్నాన్ని ఆడియెన్స్ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం“ అన్నారు.
దర్శకుడు రమేష్‌గోపి మాట్లాడుతూ – “సినిమా చాలా బాగా వచ్చింది. తరుణ్ నటన గురించి మేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఆయన నటనలోని మరో కోణాన్ని చూస్తారు. సినిమాకు శ్రీనాథ్ విజయ్ అందించిన సంగీతం, ఆర్.ఆర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళింది. నిర్మాత ప్రకాష్ మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనాథ్ విజయ్ మాట్లాడుతూ – “ఒక మంచి ప్రేమకథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చిన హీరో తరుణ్, దర్శకుడు రమేష్‌గోపి, నిర్మాత ప్రకాష్‌కి థాంక్స్. పాటలన్నీ చక్కగా వచ్చాయి. అందరికీ నచ్చేలా ఉంటాయి“ అన్నారు.