రిలయన్స్ జియో దెబ్బ నుంచి కోలుకునేందుకు ఐడియా సెల్యులార్ కొత్త ఐడియాకు తెరతీసింది. ఇటీవల జియో ప్రకటించినట్లుగానే ఐడియా సెల్యులార్ తన 4జీ హ్యాండ్ సెట్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇటీవల ఫీచర్ ఫోన్ ను సెప్టెంబర్ నుంచి మార్కెట్లోకి తెస్తామని జియో ప్రకటించిన కొన్ని రోజులకే ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది.
జియో హ్యాండ్ సెట్లలో కొన్ని యాప్స్ మాత్రమే పనిచేస్తాయని, నెటిజన్లకు కీలక అవరసరమైన వాట్సాప్ లాంటి కొన్ని ఫీచర్లు తమ హ్యాండ్ సెట్లలో అందుబాటులోకి రానున్నాయని ఐడియా ప్రకటించింది. ఈ ఫోన్ ధర దాదాపు రూ.2500 వరకు ఉంటుందని ఐడియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
‘అందరికీ నెట్ అందుబాటులోకి తెస్తూ అన్ని విషయాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. ఐడియా వినియోగదారులకు అన్ని యాప్స్ అందిస్తున్నాం. జియో మాత్రం వినియోగదారులను ఆకర్షించే హ్యాండ్ సెట్ తీసుకొస్తామని ప్రకటించినా.. అందులో అన్ని యాప్స్ వాడే సౌకర్యం లేదు. మేం త్వరలో విడుదల చేయనున్న హ్యాండ్ సెట్లలో ఈ సమస్యలు ఉండవు.
జియో ఫోన్లలో జియోనే ఆపరేటర్ గా ఉంటుంది. కానీ ఐడియా హ్యాండ్ సెట్లలో ఇతర టెలికాం ఆపరేటర్ ను ఎంచుకునే ఆప్షన్ ఉందని’ ఐడియా సెల్యులార్ ఎండీ హిమాన్షు కపానియా వివరించారు. బ్రాండ్ పేరు ఐడియా అని ఉంటుందా, లేదా ఇతర పేరుతో ఉంటుందా త్వరలో వెల్లడించనున్నారు. మొత్తానికి ఒక్క జియో ‘ఐడియా’తో పాటు అన్ని టెలికం కంపెనీలను మార్చేసిందనే చెప్పాలి..!