కొత్త రూల్స్…హెల్మెట్‌కు తాకినా ఔటే..!

266
ICC Introduces New Rules
- Advertisement -

క్రికెట్‌లో కీలకమార్పులను తీసుకొస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపై  గ్రౌండ్‌లో అతి చేస్తే వారిని బయటికి పంపే విధంగా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. అంతేగాదు అంపైర్‌కే సర్వ అధికారాలను కట్టబెట్టింది ఐసీసీ.

దీంతో ఇకపై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను మాటలతో కవ్వించడం, వారి ఏకాగ్రత దెబ్బతీసే ప్రయత్నం చేయడం,అంపైర్‌తో గొడవ పడడం లాంటివి మనకు కనిపించవు. దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌-శ్రీలంక టెస్టు సిరీస్‌ల్లో ఈ కొత్త రూల్స్‌ అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటిదాకా బ్యాట్స్‌మన్‌ కొట్టిన బంతి ఫీల్డర్‌ లేదా కీపర్‌ హెల్మెట్‌కు తాకిన తర్వాత క్యాచ్‌ పడితే దానిని నాటౌట్‌ ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు ఫీల్డర్‌, కీపర్‌ హెల్మెట్‌ను తగిలి వచ్చిన బంతికి క్యాచ్‌తో పాటు స్టంపౌట్‌, రనౌట్‌ను కూడా అనుమతిస్తారు.

బ్యాటుకు బంతికి మధ్య సమతూకం ఉండేలా చేసేందుకు బ్యాట్ల పరిమాణాల్లో మార్పులు చేశారు. బ్యాట్‌ పొడవు, వెడల్పులు అలాగే ఉంటాయి. కానీ.. అంచులు, మందంలో మాత్రం పరిమితులు తీసుకొ చ్చారు. కొత్త నిబంధనల ప్రకారం బ్యాట్‌ అంచులు 40 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. అలాగే.. డెప్త్‌ (లోతు) గరిష్ఠంగా 67 మిల్లీ మీటర్లుగా నిర్ణయించారు. ప్రత్యేక కొలమాని ద్వారా బ్యాట్లు నిబంధనలకు లోబడి ఉన్నాయో లేదో అంపైర్లు తేలుస్తారు.

ఇప్పటిదాకా వన్డేలు, టెస్టులకే పరిమితమైన డీఆర్‌ఎస్‌ను టీ-20ల్లోనూ ప్రవేశపెట్టారు. ఇక టెస్టుల్లో ప్రతీ ఇన్నింగ్స్‌లో 80 ఓవర్లు ముగిసిన తర్వాత కొత్తగా రివ్యూలు చేర్చే పద్ధతిని రద్దు చేశారు. అంటే ఇకపై ఒక ఇన్నింగ్స్‌లో రెండు రివ్యూలకే చాన్స్‌ ఉంటుంది. రెండు సార్లు రివ్యూ కోల్పోతే ఆ ఇన్నింగ్స్‌లో సదరు జట్టు డీఆర్‌ఎస్‌ కోటా ముగిసినట్టు లెక్క. వన్డేల్లో ప్రతీ ఇన్నింగ్స్‌లో ఒక రివ్యూలో మార్పు లేదు.

ఆటలో వేగం.. ఆటగాళ్లలో నైపుణ్యాలు పెరిగిన సమయంలో మైదానంలో ఫీల్డర్ల విన్యాసాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. బౌండ్రీలైన్‌ వద్ద ఫీల్డర్లు గాల్లోకి ఎగురుతూ పట్టే క్యాచ్‌లు అందులో ప్రధానం. అయితే, అలాంటి క్యాచ్‌లు కొన్నిసార్లు వివాదాలకు తావిస్తున్నాయి. దాంతో, ఇప్పుడు బౌండ్రీలైన్‌ లోపలే గాల్లోకి ఎగురుతూ పట్టే క్యాచ్‌లను మాత్రమే అనుమతిస్తారు. లైన్‌ దాటిన బంతిని గాల్లోకి ఎగురుతూ క్యాచ్‌ పట్టినా దాన్ని బౌండ్రీగానే పరిగణిస్తారు.

ఐసీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధన ఇది. ఫుట్‌బాల్‌, హాకీ తదితర క్రీడల్లో మాదిరిగా మైదానంలో దురుసుగా వ్యవహరించే ఆటగాళ్లను బయటికి పంపిచే రూల్‌ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం మ్యాచ్‌లో ఎవరైనా ఆటగాడు తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడితే అంపైర్లు అతణ్ణి మిగతా మ్యాచ్‌లో పాక్షికంగా లేదా పూర్తిగా పాల్గొనకుండా బయటకు పంపించొచ్చు. అలాగే పెనాల్టీగా ప్రత్యర్థి జట్టుకు పరుగులు కూడా ఇవ్వొచ్చు. అంపైర్‌ను బెదిరించడం, ఉద్దేశపూర్వకంగా తాకడం, ఆటగాడిపై, ఇతరులపై భౌతికంగా దాడిచేయడం, లేదా ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడితే క్రమశిక్షణా నియమావళిలో లెవెల్‌ 4 తప్పిదంగా పరిగణించి అప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటారు. ఇదివరకు ఉన్న లెవెల్‌ 1, 2, 3 తప్పిదాల నిబంధనలు కొనసాగుతాయి.

- Advertisement -