తెలుగు అగ్రనిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు జులై 21న ‘ఫిదా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
ఇటీవల ‘డిజె’ కలెక్షన్లపై సోషల్ మీడియాలో బ్యాడ్‌గా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. డీజే సినిమా ప్లాప్ అయిందని, దాన్ని కవర్ చేసేందుకు కలెక్షన్లు కావాలనే ఎక్కువ చేసి చూపెడుతున్నారనే విమర్శలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మీడియాతో మాట్లాడిన దిల్ రాజు ‘డిజె’ చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల వివాదంపై స్పందించారు. అల్లు అర్జున్ కెరీర్ లో ‘సరైనోడు’ చిత్రం కలెక్షన్లే ఇప్పటివరకూ అధికమని, దాన్ని దాటిన తరువాతనే ‘డీజే-దువ్వాడ జగన్నాథం’ చిత్రం హిట్ అని తాను ప్రకటించానని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు.
డీజే సినిమా ఫ్లాప్ అని, కలెక్షన్లపై తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని వచ్చిన విమర్శలపై స్పందించిన ఆయన, తాను ఎన్నడూ తప్పుడు మాటలు చెప్పలేదని, రాంగ్ స్టేట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు.
తమది నమ్మకమైన బ్యానర్ అని, అటువంటి సంస్థ ఓ చిత్రాన్ని హిట్ అని చెప్పిన తరువాత తప్పులు వెతకడం ఎందుకని ప్రశ్నించారు. ఓ హీరోకు ఇటువంటి సమస్య వస్తే, ఆ హీరో అభిమానుల నుంచి మరో హీరో చిత్రం వచ్చినప్పుడూ ఇదే సమస్య వస్తుందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఈ తరహా విష సంస్కృతిని పెంచకుండా హీరోలు తమ తమ అభిమానులను కట్టడి చేయాలని అన్నారు. ఇక టాలీవుడ్ ను కుదిపేస్తున్న మాదకద్రవ్యాల వ్యవహారంపై మాట్లాడుతూ, ఆ వ్యవహారంలో తనకు పూర్తి వివరాలు తెలియవని అన్నారు. అంతేకాకుండా డీజే విడుదల తరువాత తాను అమెరికాకు వెళ్లిపోయానని, హైదరాబాద్ లో ఏం జరిగిందన్న సంగతి తెలియదు’ అని చెప్పుకొచ్చారు.