జీఎస్టీ అమలులో తెలంగాణ భేష్..

197
GST won't bring in any loss to TS
- Advertisement -

జీఎస్టీని అమలు చేసే విషయంలో తెలంగాణ అద్బుత ప్రగతిని సాధించిందని తెలిపారు సీఎం కేసీఆర్. మొదటి 15 రోజుల్లోనే 90 శాతం మంది వాట్‌ ఖాతాదారులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాగలిగామన్నారు. 1.92 లక్షల మంది ట్రేడర్లు ఈనెల 15 వరకు జీఎస్టీలో అనుసంధానమై నెంబర్లు పొందారని తెలిపారు. ట్రేడర్లందరినీ అధికారులు వ్యక్తిగతం గా కలిసి జీఎస్టీ పరిధిలోకి తెచ్చారని, 15 రోజుల్లో ఇంతటి పురోగతి సాధించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు. జీఎస్టీ పై చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు, గందరగోళం కొనసాగుతున్న సమయంలో తెలంగాణ ఇంత విజయం సాధించడం గొప్ప విషయమని కేంద్రం కితాబిచ్చిందని తెలిపారు.

జీఎస్టీపై అవగాహన కల్పించి, వ్యాట్ ఖాతాదారులను గరిష్ట సంఖ్యలో జీఎస్టీలో రిజిస్టర్ చేయించడంలో విశేష కృషి చేసిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనత సాధించారని వాణిజ్య శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు ఇతర అధికారులను అభినందించారు. ఈ నెలాఖరులోగా వందశాతం రిజిస్ట్రేషన్ పూర్తి కావాలని సీఎం చెప్పారు. వస్త్ర పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, బీడీ పరిశ్రమ, ప్రజోపయోగ పనులకు సంబంధించిన జీఎస్టీ విషయంలో రాయితీలు, మినహాయింపులు కోరామని, కేంద్రం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ లో ఇప్పటికే ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం లేవనెత్తిందని, తాను కూడా స్వయంగా ప్రధానికి లేఖ రాసినట్లు సీఎం పేర్కొన్నారు.

సీఎం ఆదేశాలతో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శాంతకుమారి నాయకత్వంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించారు. సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి 1800 425 3787 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 8 నుంచి రాత్రి పది గంటల దాకా పనిచేస్తుంది. ఇప్పటి దాకా దాదాపు 3వేల మంది తమ సందేహాలను ఈ టోల్ ఫ్రీ నెంబరు ద్వారా నివృత్తి చేసుకున్నారు.

- Advertisement -