సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితపై తనకున్న ప్రేమను గతంలో వ్యక్తంచేసిన కట్జూ మరోసారి సోమవారం అదే అంశాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాను యవ్వనంలో ఉన్నప్పుడు జయలలితపై క్రష్ (వన్ సైడ్ లవ్) ఉండేదని కట్జూ తెలిపారు జయలలితను పిచ్చిపిచ్చిగా ప్రేమించానని బాంబు పేల్చారు. అంతేకాదు ఆమెతో కలిసిన ఫొటోను ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసి ఆనాటి ‘మధురస్మృతుల’లను నెమరేసుకున్నారు. ఆమె చాలా అందెగత్తె. నిజానికి నా ప్రేమ ఫలించలేదు. నేను ప్రేమిస్తున్నానని జయకు తెలియదు. ఆమె పుట్టింది 1948 ఫిబ్రవరిలో..నేను 1946 సెప్టెంబర్ లో పుట్టానని ఫేస్ బుక్ పేజీలో రాసుకొచ్చారు.
నేను 2004 నవంబర్ లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసినప్పుడు చెన్నై రాజ్ భవన్ లో మొదటిసారిగా ఆమెను కలిశాను. అప్పుడు ఆమె ముఖ్యమంత్రి. అప్పటికీ ఆమె అందెగత్తె. నేను యవ్వనంలో ఎంతగా ప్రేమించినది ఆమెతో చెప్పలేకపోయాను. అప్పుడు అలా చెప్పి ఉంటే అసంబద్ధంగా ఉండేది’’ అంటూ తన మనసులోని మాటను ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఆమె నటించిన ఓ సినిమాపాటను లింక్ ను యాడ్ చేశారు.
గత ఏడాది అక్టోబర్‌లో జయలలిత తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఇట్లాంటి పోస్టింగ్ చేశారు. ఇప్పటికీ ఆమెను నేను ప్రేమిస్తున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో ఆయన అట్లా అనడంపై ఎవరి నుంచైనా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయన్న భయంతో వెంటనే ఆ సందేశాన్ని వెనుకకు తీసుకున్నారు.