తల్లిదండ్రులంటే ఇష్టపడని వారు ఉంటారా అంటే…ఒక్కోసారి అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే.. అడిగిన వాటిని ఇవ్వలేదనో, తప్పులు చేస్తే కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తారనో.. తల్లిదండ్రులపై కోపాన్ని పెంచుకుంటుంటారు. అయితే ఇలాంటివి ఎక్కువగా స్కూల్ లో చదువుకునే రోజుల్లోనే జరుగుతుంటాయి. సరిగ్గా ఇలాంటి కోపాన్నే తల్లిదండ్రులపై పెంచుకుందట ఓ హీరోయిన్. ఆమె ఎవరోకాదు బాలీవుడ్ నటీమణి పరిణీతి చోప్రా.
తనకు తెలిసీ తెలియని వయసులో తల్లిదండ్రులను తీవ్రంగా ద్వేషించాను అని చెప్పింది. ఆర్థిక పరమైన కష్టాలే తనలో ఆ భావనను కలిగించాయని ఈమె చెప్పింది. తన హైస్కూల్ కు సైకిల్ పై వెళ్లే దాన్ని అని.. తనకు అలా వెళ్లడం ఇష్టం ఉండేది కాదని, దీంతో అమ్మానాన్నలపై కోపం వచ్చేదని పరిణీతి వివరించింది.
తమ కుటుంబం సగటు మధ్య తరగతి కుటుంబం అని, దీంతో తను సైకిల్ పైనే హైస్కూల్ కు వెళ్లాల్సి వచ్చేదని చెప్పింది. స్కర్ట్ ధరించి సైకిల్ పై వెళ్లడానికి చాలా ఇబ్బంది ఉండేదని, ఆకతాయిలు వెంట పడే వాళ్లని, స్కర్ట్ పట్టుకుని లాగే వాళ్లని పరిణీతి తన చేదు అనుభవం గురించి చెప్పింది.
కొన్ని రోజుల పాటు తండ్రి మరో సైకిల్ లో తన వెంటే వచ్చే వారని, అప్పుడు ఇబ్బంది ఉండేది కాదని, ఎప్పుడైతే ఆయన రాలేదో అప్పుడు మళ్లీ ఆకతాయిలు రెచ్చిపోయే వారని వివరించింది. దానికంతటికి కారణం తను సైకిల్ పై వెళ్లడమే అని, ఇంట్లో వాళ్లకేమో తనను ఆటోలో, కారులో స్కూల్ కు పంపించే శక్తి లేదని స్పష్టం చేశారని.. దీంతో పేరెంట్స్ పై ద్వేషం కలిగిందని ఈ హీరోయిన్ వ్యాఖ్యానించింది.
అయితే తర్వాతి కాలంలో తమ ఆర్థిక పరిస్థితిపై అవగాహన కలిగిందని, ద్వేషం స్థానంలో తల్లిదండ్రులపై జాలి, దయ కలిగాయని పరిణీతి వివరించింది. ఇక బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మహిళల కోసం ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్పించే సంస్థను కొన్నాళ్ల కిందట ప్రారంభించారు. అందులో మహిళలకు ఆత్మరక్షణ విద్యను నేర్పుతున్నారు. ఆ సంస్థ నుంచి ఫస్ట్ బ్యాచ్ శిక్షణను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పరిణీతి అతిథిగా హాజరయ్యాయ్యి ఈ విధంగా ప్రసంగించింది.