తెలంగాణలో హ్యుండై భారీ పెట్టుబడి..

98
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన హ్యుండై గ్రూప్ ఈరోజు తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌తో దావోస్ లోని తెలంగాణ పెవీలియన్‌లో హ్యుండై సిఐఓ యంగ్‌చో చి (CIO Mr. YoungCho Chi) సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. ఈ పెట్టుబడితో తమ కంపెనీ టెస్ట్ ట్రాక్ లతో పాటు ఇకో సిస్టమ్ అవసరం అయిన ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఉన్న ఇతర అవకాశాల పైన కూడా విస్తృతంగా చర్చించారు.

తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగానికి హ్యుండై పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేకంగా ఒక మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఇందులో భాగస్వామిగా ఉండేందుకు ముందుకు వచ్చిన హ్యుండైకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో 1400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హ్యుండై కంపెనీకి సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హ్యుండాయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు మొబిలిటీ రంగంలో వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -