నాలుగు కొత్త జిల్లాలపై హై పవర్ కమిటీ..

255
- Advertisement -

నాలుగు కొత్త జిల్లాలపై కేకే నేతృత్వంలో నలుగురు మంత్రులతో హై పవర్ కమిటీ ఏర్పాటైంది. కమిటీతో మహమూద్ ఆలీ, జగదీష్ రెడ్డి, పోచారం, రామన్నలున్నారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటును ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ నెల ఏడో తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో దసరా పండుగనుంచి కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చిన్న జిల్లాలతో పాలన మరింత మెరుగుపడుతుందన్నారు. సత్వర అభివృద్ధికి, స్థానిక వనరుల సద్వినియోగానికి, పేదరిక నిర్మూలనకు చిన్న జిల్లాల ఏర్పాటు ఎంతగానో దోహదపడుతుందన్నారు. అందుకే సగటున 3 లక్షల జనాభాకో జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థమే ఈ పక్రియ చేపట్టాం కాబట్టి జిల్లాలు, డివిజన్లు, మండలాల సంఖ్య ఎంత పెరిగినా ఫర్వాలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రహదారులు, పరిశ్రమలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ త్వరలోనే పూర్తవుతాయని, 2022 నాటికి రాష్ట్ర బడ్జెట్ ఐదు లక్షల కోట్లకు చేరుతుందని చెప్పారు. ఆ నిధులన్నీ పేదరిక నిర్మూలన కోసమే వినియోగిస్తామని అన్నారు. పదవులు శాశ్వతం కాదు. ప్రజలు ఎల్లకాలం ఉంటారు. ఇప్పుడు ఏర్పాటు చేసే జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఎల్లకాలం ఉంటాయి. ప్రజల సౌకర్యార్థమే నూతన జిల్లాల ఏర్పాటు జరుగాలి అని ముఖ్యమంత్రి పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. చిన్న పాలనా విభాగాలే మంచి ఫలితాలిస్తాయని ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు సూచిస్తున్నాయని, అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

TRS-president

ప్రతి జిల్లాలో మంత్రి, కలెక్టర్ తమ కంప్యూటర్లో కుటుంబాల వివరాలు నమోదు చేసుకొని, స్వయంగా ఒక్కో కుటుంబం గురించి శ్రద్ధ తీసుకుని పలుకరించే పరిస్థితి రావాలని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా పర్యవేక్షణ లోపం వల్ల అనుకున్న మేరకు ఫలితాలు రావడం లేదని సీఎం అన్నారు. సమాజంలో పేదరికం, అసమానతలు ఉన్నంత వరకు అశాంతి, అలజడి ఉంటాయ న్నారు. వీటిని రూపుమాపడంలో చిన్న పరిపాలనా విభాగాలు మంచి ఫలితాలను అందిస్తాయన్నారు. ప్రజల సౌక ర్యం కోసం పునర్వ్యవస్థీకరణ చేపట్టాం కాబట్టి ఆ మేరకు ఏవైనా మార్పులు, చేర్పులకు సంబంధించిన నివేదికలు ఉంటే వాటిని మంగళవారం ఇవ్వాలని సూచించారు.

రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో 5, కరీంనగర్ 4, మహబూబ్‌నగర్ 4, మెదక్ 3, నల్లగొండ 3, ఆదిలాబాద్ 4, నిజామాబాద్ 2, ఖమ్మం 2, నిజామాబాద్ 2, హైదరాబాద్‌లో 1 చొప్పున జిల్లాలు ఏర్పడే అవకాశాలున్నాయి. మొత్తంగా 31 జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -