హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్‌..

253
- Advertisement -

మీకు హెల్మెట్‌ ధరించే అలవాటు లేదా.. సీట్‌ బెల్ట్‌ పెట్టుకోరా.. అప్పుడప్పుడు రాంగ్‌ రూట్‌లోనూ వెళుతుంటారా.. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా… ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నారా? అయితే మీకు కష్టాలు తప్పవు. ఇదంతా గతం. ఇలాంటి వాటికి ఎలాంటి పరిణామాలు ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే.

కానీ తాజాగా ఇప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే మరిన్ని సమస్యలు తప్పవంటున్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించడానికి కొత్త ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు తీసుకొస్తున్నారు.

 hyderabad police to introduce penalty point system august 1st

ఈ మేరకు పెనాల్టీ పాయింట్లను ఏర్పాటుచేసి.. వాటి ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దుచేయనున్నారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఆగస్టు 1 నుంచి కొత్త ట్రాఫిక్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

hyderabad police to introduce penalty point system august 1st

ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతోనే పెనాల్టీ పాయింట్‌ సిస్టమ్‌కు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఉల్లంఘనను బట్టి వాహన చోదకులకు పాయింట్లు కేటాయిస్తామన్నారు. 24 నెలల్లో 12 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు దాటితే ఏడాదిపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు. లైసెన్స్‌ రద్దయిన సమయంలో వాహనాన్ని నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రెండోసారి 12 పాయింట్లు దాటితే రెండేళ్లు, మూడోసారి దాటితే మూడేళ్ల పాటు లైసెన్స్‌ను రద్దు చేస్తామన్నారు.

హైదరాబాద్ రోడ్లపై నిత్యం ప్రయాణించేవారి భద్రత కోసమే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చామని వివరించారు. ఈ మేరకు తెలంగాణ మోటార్ వెహికల్స్ రూల్స్‌లో పెనాల్టీ పాయింట్ సిస్టమ్‌ను చేర్చుతూ ప్రభుత్వం జీవీ నం.26ను జారీ చేసింది. పాయింట్ల పకడ్బందీగా లెక్కించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశామని కమిషనర్ వెల్లడించారు. ఈ కొత్త పెనాల్టీ పాయింట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారని చెప్పారు.

- Advertisement -