హైదరాబాద్ జీవ వైవిధ్య సూచీని మంత్రి కేటీఆర్ నానక్‌రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో విడుదల చేశారు. ఒక నగరం ప్రత్యేకతలతో కూడిన బయోడైవర్సిటీ ఇండెక్సస్ నివేదికను తయారు చేసిన భారతదేశంలోని ఏకైక నగరంగా హైదరాబాద్ ఘనత సాధించిందన్నారు. 2011లొ హైదరాబాద్‌లో సీవోపీ11 సమావేశం జరిగిన విషయం తెలిసిందే. నగరంలో ఉన్న జీవవైవిధ్య పరిరక్షణ పర్యవేక్షణ అభివృద్దికి ఈబయోడైవర్సిటీ ఇండెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బయోడైవర్సిటీ రంగంలో సింగపూర్ చేసిన భాగస్వామ్యానికి గుర్తింపుగా దీన్ని సింగపూర్ ఇండెక్స్ పేరుతో పిలుస్తున్నారు.
సరస్సుల నగరంగా పేరొందిన హైదరాబాద్ లో ప్రస్తుతం దాదాపు రెండు వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న 1350 కి పైగా జల వనరులు, 1600 హెక్టార్లలో విస్తరించిన సహజ రాళ్లగుట్టలు(రాక్ ఫార్మేషన్స్) , నగరంలో ఉన్న రెండు జాతీయ పార్కులు నగరంలో జీవవైవిధ్యానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఈ నివేదికలో వెల్లడించారు. దీంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇక్రిసాట్ వంటి సంస్థలకు ఉన్న సువిశాలమైన క్యాంపస్ లు జీవవైవిధ్యానికి కేంద్రాలుగా ఉన్నాయని నిలిచాయన్నారు. హైదరాబాద్ నగరానికి ఉన్న సహజ సిద్ధమైన జీవవైవిధ్య వనరులను పరిరక్షించడం ద్వారా నగర జీవవైవిధ్య సూచీలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు అవకాశం కలిగింది.
ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్ లో 1305 వృక్షజాతులు ఉండగా, 577 ప్రాంతీయ వృక్ష జాతులు, 728 ఇతర ప్రాంత వృక్ష జాతులు నగరంలో ఉన్నాయని తేలింది. 30 రకాల తూనీగ జాతులు (odonates), 141 జాతుల సీతాకోక చిలుకలు, 42 రకాల సాలీడు పురుగులు, 60 రకాల చేపలు, 16 రకాల (amphibians) ఉభయచర జాతులు, 41 రకాల సరీసృపాలు, 315 పక్షి జాతులు, 58 క్షీరదాలు (mammalian) ఉన్నట్లు ఈ నివేదికలో పొందుపరిచారు. జీహెచ్ఎంసీ ఈ బయోడైర్సిటీ ఇండెక్స్ కోసం జరిపిన అధ్యయనంలో 92మార్కులకు గాను 57మార్కులను సాధించినట్టుగా నివేదికలో పేర్కొన్నారు.
Also read: UPYOGI:యూపీలో ఏ మాఫియా బెదిరించలేదు
నగర జీవవైవిధ్య సూచీ వలన ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ప్రయత్నాలు ఈరంగంలో స్థానిక ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం జీవవైవిధ్య వృద్ధి కోసం రూపొందించిన మార్గదర్శకాలు వంటివి మొత్తం 23రకాల అంశాలను కొలమానంగా తీసుకొని ఈ సూచీని రూపొందించడం జరిగిందన్నారు. హైదరాబాద్ నగరంలో జీవవైవిద్య పరీరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల బయోడైవర్సిటీ సూచీలో గణనీయమైన వృద్ధిని సాధించినట్టుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక నిజమైన ప్రపంచ స్థాయి నగరంగా మారే పరిణామ క్రమంలో జీవవైవిధ్యం అత్యంత కీలకమైన అంశమని కేటీఆర్ అన్నారు. జీవించు- జీవించనివ్వు అన్న స్ఫూర్తి ఆధారంగా నగరీకరణ జరిగినప్పుడే ప్రకృతితో మమేకమై బతకగలిగే పరిస్థితి ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత హారం, చెరువుల సంరక్షణ – బలోపేతం, అడవుల పెంపకం, అర్బన్ లంగ్ స్పేసెస్ వంటి అభివృద్ది కార్యక్రమాలు నగర జీవవైవిధ్యానికి ఎంతగానో ప్రయోజనకరంగా నిలిచాయన్నారు.
Also read: చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ సొంతం..
భవిష్యత్తులోనూ నగరంతోపాటు, నగరం చుట్టుపక్కల కూడా జీవివైవిధ్యం మరింత పెరుగుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని పురపాలికల్లో జీవవైవిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతోందన్నారు. దీంతోపాటు పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీల ఏర్పాటు వంటి అనేక ఇతర హరిత కార్యక్రమాలకు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ ను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్థావించారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి అటు పట్టణాలు, ఇటు పల్లెల్లోనూ తెలంగాణ వ్యాప్తంగా హరిత కవర్ పెరిగిందని, దీంతో జీవవైవిధ్యం పెరిగేందుకు అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.
హైదరాబాద్ తో పాటు అనేక పట్టణాలకు ఈ కేటగిరీలో అవార్డులు సైతం లభించాయని కేటీఆర్ తెలిపారు. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ప్రజల్లో బయోడైవర్సిటీ పట్ల మరింత అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. జూన్ 5వ తేదీన పట్టణాల్లో హరితాన్ని పెంచిన పురపాలికలకు, వాటి సిబ్బందికి ప్రత్యేకంగా హరిత అవార్డులు అందజేస్తామని మంత్రి వెల్లడించారు.