హైదరాబాద్ వాసుల మెట్రో కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో సంబరం కొద్దిరోజుల్లో తీరిపోనుంది. ఇప్పటికే పట్టాలెక్కి ట్రయిల్ రన్ విజయవంతంగా ముగించుకున్న మెట్రో…ఈ నెల 28న అధికారికంగా జంట నగరాల్లో చక్కర్లు కొట్టనుంది. ఇప్పటిదాకా ట్రయిల్ రన్ చూసి మురిసిపోయిన ప్రజలు..ఇప్పుడు ఏకంగా ట్రైన్ ఎక్కి తమ కోరిక తీర్చుకోనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మెట్రోను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ మెట్రోలో అమీర్ పేట వరకు ప్రయాణించనున్నారు. వీరితో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా కూడా మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొనున్నట్లు సమాచారం. మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ రానున్న ఇవాంక పలు కార్యక్రమాల్లో పాల్గొననుంది.
తొలిదశలో 2 కారిడార్లలో (నాగోల్-బేగంపేట, మియాపూర్-అమీర్‌పేట) మెట్రో అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైల్ సేవలు ప్రారంభించడానికి రైల్వేశాఖకు చెందిన సేఫ్టీ కమిషన్ కూడా పచ్చజెండా ఊపింది. మెట్రోలోని వివిధ విభాగాలను పరిశీలించిన రైల్వే సేఫ్టీ కమిషన్… సివిల్ వర్క్, ట్రాక్, వయాడక్, స్టేషన్స్, విద్యుత్, సిగ్నల్స్, ట్రైన్ కంట్రోల్, టెలీ కమ్యూనికేషన్, రోలింగ్ స్టాక్ తోపాటు ఇతర రైల్వే సిస్టమ్ మొత్తాన్ని నిశితంగా తనిఖీ చేసి సేఫ్టీ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. దీంతో 30 కిలోమీటర్ల మొత్తం దూరానికి మెట్రో రైలు సిద్ధం అయ్యింది.
మెట్రో పనులు శరవేగంగా జరగడంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే.. మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తికాదు.. రైలు ఎక్కేందుకు జనాలుండరు.. ఎల్‌అండ్‌టీ వెనుకకుపోవడం ఖాయమంటూ విషప్రచారం జరిగింది. కానీ అదంతా దుష్ప్రచారమేనని అనతికాలంలోనే తేలిపోయింది. మెట్రోకు నాటి ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చి న చేయూత కన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రొత్సాహమే ఎక్కువ. సీఎం కేసీఆర్ చూపించిన ప్రత్యేక చొరవకు తోడు ఎల్ అండ్ టీ,అధికారుల సమన్వయంతో మెట్రో పరుగులు పెట్టేందుకు సిద్దమైంది. పలుమార్లు స్వయంగా రివ్యూ నిర్వహించిన కేటీఆర్ గవర్నర్ నరసింహన్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. పనులు జరుగుతున్న తీరుతో పాటు అత్యాధునిక సాంకేతికతను గవర్నర్‌కు వివరించారు.
మెట్రో స్టేషన్లలో అమీర్ పేటలోని ఇంటర్ ఛేంజ్ స్టేషన్ ప్రపంచస్ధాయి సాంకేతికతతో నిర్మాణమైంది. మెట్రో కారిడార్లలోని ప్రధాన రహదారులను జీహెచ్‌ఎంసీ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా తీర్చి దిద్దుతూ, స్టేషన్లకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు, ఫుట్‌పాత్‌లను నిర్మించారు. ప్రధానంగా మెట్రో ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని మెట్రోస్టేషన్ల వద్ద బస్ బే, ఆటో బేస్, ఈ వాహనాలతో పాటు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు.