హైదరాబాద్ మెట్రోపై ప్రజల ప్రశంసలు..

53
Hyderabad Metro Rail

హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మెట్రో నిలిచింది. ఇక అసలు విషయానికొస్తే.. అక్టోబర్ 14 రాత్రి అత్యంత భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ టైంలో LB నగర్‌-మియాపూర్‌ మార్గంలోని విక్టోరియా మెమోరియల్‌ (కొత్తపేట) స్టేషన్‌కు రాత్రి దాదాపు 10 గంటలకు ఓ గర్భిణి వచ్చింది. ప్రస్తుతం మెట్రో సర్వీసులను… ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకూ నడుపుతున్నారు. తనను మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు చేర్చాలని ఆమె అధికారులను వేడుకుంది. పరిస్థితిని అర్థం చేసుకున్న మెట్రో సిబ్బంది… మానవత్వంతో స్పందించారు. ఉన్నతాధికారుల అనుమతితో ఆమె కోసమే ప్రత్యేకంగా మెట్రో రైలును నడిపారు.

ఆ మహిళ సురక్షితంగా గమ్యాన్ని చేరింది. శుక్రవారం మెట్రోరైలు భవన్‌లో జరిపిన మీడియా సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ NVS రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. అత్యవసర సమయాల్లో ప్రజలను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వర్ష బీభత్సానికి రోడ్లు అధ్వానంగా మారాయి కాబట్టి… మెట్రో రైళ్లలో గ్రేటర్‌ ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో మంది నెటిజన్లు దీన్ని తెలుసుకొని… మెచ్చుకుంటున్నారు. తాము చాలా సార్లు మెట్రో రైళ్లలో వెళ్తున్నామనీ… ఇకపైనా వెళ్తామని చెబుతున్నారు. ప్రతీదీ కమర్షియల్‌గా ఆలోచించే ఈ రోజుల్లో… మానవతా దృక్పథంతో ఆలోచించిన మెట్రో ఎండీ, సిబ్బందికి ధన్యవాదాలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో 40 శాతం రాయితీ ప్రకటించింది. ఈనెలాఖరు వరకు సువర్ణ ఆఫర్ కింది ఈ రాయితీ వర్తిస్తుంది.