ప్ర‌జ‌లెప్పుడూ అభివృద్ధి ప‌క్షానే ఉంటారు..

29
errabelli dayakar

ఆదివారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్, రైతు రుణ విముక్తి సంస్థ చైర్మ‌న్ నాగూర్ల వెంక‌న్న‌, మ‌హిళా సాధికారిక సంస్థ చైర్ ప‌ర్స‌న్ గుండు సుధారాణి, కార్పొరేట‌ర్లు, వ‌రంగ‌ల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, GWMC కమిషనర్ పమేలా సత్పతి, ఆయా శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ: గ‌తంలో ఎమ్మెల్యేలు ఎక్క‌డ ఉంటారో? ఎక్క‌డ దొరుకుతారో? ప‌్ర‌జ‌ల‌కు తెలిసేది కాదు. అలాగే ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాలంటే ఎమ్మెల్యేకు కూడా ఇబ్బందీగానే ఉండేది.అనేక మంది ఎమ్మెల్యేల ఇళ్ళు ఇరుకుగా, స‌దుపాయంగా ఉండేవికావు. అందుకే సీఎం కేసీఅర్ శాసనసభ్యులు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోనూ క్యాంపు కార్యాలయాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం పూర్తయ్యాయి. మ‌న ఉమ్మ‌డి జిల్లాలోనూ దాదాపు అన్ని క్యాంపు కార్యాల‌యాల నిర్మాణం పూర్త‌య్యాయి. ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే క్యాంపు కార్యాల‌యాలు స్థ‌లాలు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆల‌స్య‌మయ్యాయని మంత్రి తెలిపారు.

ఆల‌స్య‌మైనా స‌రే, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే మంచి స్థ‌లాన్ని ఎంచుకున్నారు.నిర్ణీత స‌మ‌యంలో ఈ క్యాంపు కార్యాల‌యాన్ని పూర్తి చేసేలా అధికారులు వేగంగా ప‌నులు పూర్తి చేయాలి. నా చేతుల మీదుగా ఈ క్యాంపు కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేయ‌డం ఆనందంగా ఉంది. ఉమ్మ‌డి జిల్లాలో నేను శంకుస్థాప‌న లేదా, ప్రారంభోత్స‌వాలు చేసిన క్యాంపు కార్యాల‌యాల ఎమ్మెల్యేలంతా తిరిగి గెలిచారు. ఈ సెంటుమెంటు తెలిసే కావ‌చ్చు… న‌రేంద‌ర్ నా చేతే త‌న క్యాంపు కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేయించారు అని అన్నారు.ఈ క్యాంపు కార్యాలయం నిర్మాణం తొందరగా చేపట్టి ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి. క్యాంప్ కార్యాలయం పూర్తయ్యాక వరంగల్ తూర్పు శాసనసభ్యులు ఇక్కడే అందుబాటులో ఉంటారు. దీని ద్వారా వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి వేగవంతమవుతుంది.

ఇక వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని అణువు అణువు నాకు తెలుసు. వ‌రంగ‌ల్ ని అద్దంలా అభివృద్ధి చేసే బాధ్య‌త నాది అన్నారు మంత్రి. ఎక్క‌డెక్క‌డ ఏ విధంగా ఏయే అవ‌సరాలున్నాయో నాకు బాగా తెలుసు.వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌రాబాద్ త‌ర‌హాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసే ప‌నికి సీఎం కేసీఅర్, పుర‌పాల‌క మంత్రి కెటిఆర్ కంక‌ణ బ‌ద్ధులై ఉన్నారు. ఇప్ప‌టికే అనేక ర‌కాల అభివృద్ధి ప‌నులు, నిధులు వ‌రంగల్ కి సిఎం ఇచ్చారు. మొన్న‌టి వ‌ర్షాల బారిన ముంపున‌కు గురైన ప్రాంతాల పున‌రావాసానికి, ఇత‌ర అభివృద్ధి ప‌నులకు వెంట‌నే నిధులు కేటాయించిన ఘ‌నత‌ సీఎం కేసీఅర్ ది. వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ పై ఇప్ప‌టికే ఒక స‌ర్వే నిర్వ‌హించాం.. ఆ స‌ర్వేలో వార్ వ‌న్ సైడ్ లా వ‌రంగ‌ల్ మొత్తం వ‌న్ మ‌న సైడే ఉంది. ఎమ్మెల్యేలు, మేయ‌ర్, కుడా చైర్మ‌న్, కార్పొరేట‌ర్లు, వ‌రంగ‌ల్ అభివృద్ధి పైనే దృష్టి సారించండి.ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ ప‌క్షానే ఉన్నారు.

ప్ర‌జ‌లెప్పుడూ అభివృద్ధి ప‌క్షానే ఉంటారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తెలిసి, అభివృద్ధి చేస్తున్న సీఎం, మంత్రి మ‌న‌కుండ‌టం మ‌న అదృష్టం. త్వ‌ర‌లోనే ఈ క్యాంపు కార్యాల‌యం ప్రారంభోత్స‌వం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను. న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ రూపంలో మంచి ఎమ్మెల్యే వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి దొర‌క‌డం అదృష్టం. న‌రేంద‌ర్ బాగా క‌ష్టప‌డుతున్నారు, వ‌రంగ‌ల్ ప్ర‌జ‌ల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపరు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాగా, ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.