గత పదేళ్లలో ఎన్నడూలేని పెనుతుపాను ‘మాథ్యూ’ దెబ్బకు అమెరికాలోని ఫ్లోరిడా వణికిపోతోంది. హైతీలో మాథ్యూ హరికేన్ వల్ల ఇప్పటికే 2339 మందిని పొట్టనబెట్టుకున్న ఈ హరికేన్.. ఫ్లోరిడాకు దగ్గరైంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫ్లోరిడా, జార్జియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. గంటకు 215 కిలోమీటర్ల పెనుగాలులతో ఈ హరికేన్ భారీ బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపడుతున్నారు.
కరీబియన్ దీవుల నుంచి ఉత్తర దిశగా కదిలి అమెరికావైపు వెళ్తుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గంటలకు 215 కిలోమీటర్ల పెనుగాలులతో ఈ హరికేన్ ఫ్లోరిడాను సమీపిస్తున్నట్లు యూఎస్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. శుక్రవారం రాత్రి కల్లా ఈ హరికేన్ ఫ్లోరిడా భూభాగంలోకి చొచ్చుకురావడమో లేక అట్లాంటిక్ తీరం వెంబడి వెళ్లిపోవడమో జరుగుతుందని మియామీ సెంటర్ చెబుతోంది. ఈ హరికేన్ తెచ్చే పెను గాలుల వల్ల ఫ్లోరిడాలో విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఈశాన్య ఫ్లోరిడాను గత 118 ఏళ్లలో తాకపోయే అతి పెద్ద హరికేన్ ఇదేనని యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ భావిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచే హరికేన్ ప్రభావం ఫ్లోరిడాలో కనిపిస్తుందని, రాత్రికల్లా ఇది తీవ్రమవుతుందని మియామీలోని వెదర్ సెంటర్ చెప్పింది. సుమారు కోటి 20 లక్షల మందిని ఇది ప్రభావితం చేయనుందని అక్కడి వాతావరణ చానెల్ పేర్కోంది. కెన్నెడీ స్పేస్ సెంటర్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న బిలియన్ల డాలర్ల సౌకర్యాలు, పరికరాలకు తీవ్ర నష్టం వాటిల్లనున్నదని ఆయన అంచనా వేశారు. దీంతో నాసా, యూఎస్ ఎయిర్‌ఫోర్స్ వాటిని కాపాడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశారు.చివరిసారి 2005లో హరికేన్ విల్మా గంటకు 177 కిలోమీటర్ల వేగం గాలులో యూఎస్ తీరాన్ని తాకింది.