రివ్యూ:మన వూరి రామాయణం

316
Mana Ooori Ramanayam
- Advertisement -

విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాశ్ రాజ్.. నటుడిగా ప్రకాష్‌ రాజ్‌ ఎన్నో జాతీయ అవార్డుల్ని అందుకొన్నారు. దర్శకుడిగానూ తనలో ఉన్న కోణాన్ని బయటపెట్టాలనుకొన్నారాయన. అందుకే ‘ధోని’ సినిమాతో మెగాఫోన్‌ పట్టారు. ‘ఉలవచారు బిర్యానీ’ రుచి చూపించారు. అయితే.. ఈ రెండు సినిమాలూ అంతంత మాత్రంగానే ఆడాయి. ఇప్పుడు ‘మన వూరి రామాయణం’ అంటూ మరో కథ చూపించేందుకు సిద్ధమయ్యారు. మలయాళ చిత్రం ‘షట్టర్‌’కి రీమేక్‌ ఇది. మరి ఆయన ప్రయత్నం ఎలా సాగింది? ప్రకాష్‌రాజ్‌లోని దర్శకుడు ఎంతవరకు బయటకొచ్చాడు? ఇంతకీ ఈ సినిమా కథేంటి? అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :
అదో పల్లెటూరు. ఆ వూర్లో భుజంగం (ప్రకాష్‌రాజ్‌) పెద్ద మనిషి. అందరూ సలాం కొడుతుంటారు. తన కుటుంబంతో పాటు సమాజంలోనూ మంచి వ్యక్తిగా, పరువు ప్రతిష్టలతో జీవితం గడపాలన్నదే భుజంగయ్య కోరిక. ఇంట్లో పెళ్లీడొచ్చిన కూతురు ఉంటుంది. తనకో సంబంధం వస్తే.. ‘నేనప్పుడే పెళ్లి చేసుకోను’ అంటుందా అమ్మాయి అనడంతో అసహనంతో రగిలిపోతుంటాడు భుజంగం. తెల్లారితే శ్రీరామనవమి అనగా ఆ రోజు రాత్రి చిత్తుగా తాగుతాడు భుజంగం. ఆ మత్తులో ఓ వేశ్య (ప్రియమణి)ని చూసి మనసు పారేసుకొంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో భుజంగయ్య తన ఇంటిని ఆనుకొనే ఉండే ఓ చిన్న కొట్టులో ప్రియమణితో పాటు చిక్కుకుపోతాడు. ఆ తర్వాత తన పరువు పోకుండా, ఎవ్వరికీ ఈ విషయం తెలియకుండా భుజంగయ్య ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా.

unnamed (10)

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ప్రధాన బలాలు ప్రకాష్ రాజ్ నటన.. కథాంశం.. . మలయాళంలో తీసిన సినిమాను తెలుగులో అనువదించే ప్రయత్నం చేశారు ప్రకాష్‌రాజ్‌. ముఖ్యంగా కథలోని ఎమోషన్ కట్టిపడేసేలా ఉంది. ఆ ఎమోషన్‌ను కూడా ఎక్కడా స్థాయి మించనివ్వకుండా చూడడం ఇంకా బాగా ఆకట్టుకుంది. ఈ కథంతా నాలుగు పాత్రల చుట్టూనే నడుస్తుంది. వివిధ సందర్భాల్లో వాళ్ల భావోద్వేగాలు, సంఘర్షణ, జీవితాన్ని చూసే కోణం వీటి మధ్య సన్నివేశాల్ని అల్లుకొన్నారు. చిన్న గదిలో దాదాపు సగం సినిమా నడుస్తుంది. ప్రియమణి.. ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచే సన్నివేవేశాలు కట్టిపడేస్తాయి. తొలిసగం సమయం తెలీకుండానే గడిచిపోతుంది. ప్రియమణి తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. చాలాకాలం తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రమిది. మంచి పాత్రలు దొరికితే తాను పోటీలోనే ఉన్నానని చెప్పేస్తుందీ సినిమా. సత్యదేవ్ ప్రకాష్ రా‌జ్‌కు నమ్మిన భంటుగా చాలా బాగా చేశాడు. కామెడీ పాత్రలతోనే ఎక్కువగా మెప్పిస్తూ ఉండే పృథ్వీ ఇందులో ఓ బలమైన సీరియస్‌నెస్ ఉన్న పాత్రలో నటించి కట్టిపడేశాడు.

మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్‌లో కొన్నిచోట్ల కథా వేగం తగ్గి బోర్‌గా అనిపించడం.. వాస్తవానికి ఇలాంటి కథల్లో వినోదాన్ని ఆశించలేం. ముఖ్యంగా కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలతో కథలోకి వెళ్ళకుండా పక్కదార్లు పట్టినట్లు అనిపించింది. ఇక రెగ్యులర్ కమర్షియల్ అంశాల జోలికి అస్సలు పోకుండా ఉన్న ఈ సినిమా అలాంటి అంశాలే కోరేవారికి నచ్చకపోవచ్చు.

సాంకేతిక విభాగం :
దర్శకుడిగా తన గత చిత్రాలకంటే మెరుగైన పనితనమే కనబరిచారు ప్రకాష్‌రాజ్‌. ఒక చిన్న ప్రపంచం చుట్టూనే తిరిగే అలాంటి కథను సినిమాగా తెరకెక్కించడంలోనూ మేకింగ్ పరంగా ప్రకాష్ రాజ్ చాలాచోట్ల మెరిశారు. ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. సన్నివేశాల్లోని తీవ్రత.. గాఢత చెప్పడంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. ముకేశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా అవసరానికి తగ్గట్టు బాగున్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శశిధర్ ఆర్ట్ వర్క్ బాగున్నాయి.

unnamed (13)

తీర్పు :
మాస్‌ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందా లేదా అనేది పక్కన పెడితే, సినిమాపై ఇష్టంతో కూర్చుంటే మాత్రం ఫలితం కనిపిస్తుంది. రోటీన్ సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ఈ సినిమా కొత్త తరహా అనుభవమే. ‘మన ఊరి రామాయణం’ రాముడిలా కనిపించే మనిషిలోని రావణాసురుడిని బయటకు తీసుకొచ్చి చూపే సినిమా.

విడుదల తేదీ : అక్టోబర్ 07, 2016
రేటింగ్‌:2.5/5
నటీనటులు : ప్రకాష్ రాజ్, ప్రియమణి
సంగీతం : ఇళయరాజా
నిర్మాత : ప్రకాష్ రాజ్
దర్శకత్వం : ప్రకాష్ రాజ్

- Advertisement -