ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జూరాల ప్రాజెక్టు జలాశయం నిండు కుండలా మారింది.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులోకి 2.33 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుండి ప్రస్తుతం దిగువ ఉన్న శ్రీశైలం వైపు 2,24,741 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుత నీటిమట్టం: 317.47 మీటర్లు (పూర్తి స్థాయి నీటిమట్టం: 318.516 మీటర్లు)కాగా ప్రస్తుత నీటి నిల్వ: 7.6 టీఎంసీలు (పూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 9.657 టీఎంసీలు) అని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్ అధికారులు మరియు జిల్లా యంత్రాంగం సూచించింది. నది వైపు ఎవరూ వెళ్లకూడదని, గొర్రెల కాపరులు, జాలరులు, పశువుల కాపరులు నది దాటే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద చేరుకునే అవకాశం ఉంది.
Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!

