కరోనా కట్టడి కోసం చేపట్టిన రిలీఫ్ ఫండ్ కి అనూహ్య స్పందన వస్తోంది. పలువురు ప్రముఖులు స్వచ్చందంగా విరాళాలు అందిస్తున్నారు.
ప్రగతి భవన్ లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, హీరో నితిన్ విరాళాన్ని అందజేశారు. కరోనా నిరోధానికి ఒకరోజు మూల వేతనాన్నిప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీఎం సహాయనిధికి రూ.48కోట్లు విరాళంగా అందజేశారు.
హీరో నితిన్ పది లక్షల విరాళాన్ని సీఎం కేసీఆర్ కు అందజేశారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కలిసిన ఆయన రూ. 10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నితిన్‌ను అభినందించిన కేసీఆర్ ఆయనను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. నితిన్ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు.
ఈ సందర్భంగా నితిన్ మాట్లడుతూ, కరోనా వ్యాప్తి నిరోధ కార్యక్రమాల విషయంలో సీఎం కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ గారి స్ఫూర్తితో ప్రజలందరూ లాక్‌డౌన్‌కు పూర్తిగా సహకరించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్నందున వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గారిని కలుసుకొని, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి తాను ప్రకటించిన రూ. 10 లక్షలను అందజేస్తానని నితిన్ తెలిపారు.
కరోనా నివారణ చర్యలకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల సతీమణి అనుపమ రూ.2కోట్ల విరాళం అందించారు. ఈ సందర్భంగా అనుపమ తండ్రి, విశ్రాంత ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్ సీఎంను కలిసి చెక్ అందజేశారు.