ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్.. పెద్ద పెద్ద ప్రగల్బాలకు పోతూ.. భారీ ఆడంబరాలతో ఎన్నికల బరిలో నిలబడ్డారు. పచ్చ మీడియా కూడా ఆయనకు బాగానే ప్రచారం కల్పించింది. ప్రజాశాంతి పార్టీ పేరుతో ఏపీలో చాలాచోట్ల అభ్యర్థులను నిలిపి.. ప్రచారంలోనూ హడావిడి చేసి.. ఒకింత కామెడీని కూడా పంచారు. అలాంటి కేఏ పాల్ చివరకు తాను పోటీ చేసిన నరసాపురం లోక్‌సభ స్థానంలో డిపాజిట్ కూడా దక్కించుకోకుండా పరువు పోగొట్టుకున్నారు.
ఇదే ట్రెండ్ కొనసాగితే 175 సీట్లనూ సొంతం చేసుకుంటాం’ అని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్షరాలా.. రెండు వందల ఎనభై ఒకటి(281). సామాజిక మాధ్యమాల్లో చెలరేగి పోయిన పాల్ తన క్రేజ్‌తో బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాను ట్రెండ్ సెట్టర్‌గా మారడం ఖాయమని, సునామీ సృష్టిస్తామని చెప్పుకొచ్చారు పాల్.
పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా కేఏ పాల్ రంగంలోకి దిగారు. అదే నియోజక వర్గం జనసేన నుండి పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు, వైసీపీ నుండి రాఘరామక్రిష్ణంరాజులు పోటీలో ఉండగా.. టీడీపీ నుండి వేటుకూరి శివరామరాజు ఉన్నారు. నర్సాపురంలో కనీసం 300 ఓట్లను కూడా సొంతం చేసుకోలేకపోయారు. ఇక ఆ పార్టీ అభ్యర్థులకు కూడా ఎక్కడా 300 ఓట్లు దాటలేదు.
నర్సాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పాల్.. అదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు కూడా పోటీపడ్డారు. అయితే, అక్కడ మాత్రం ఆయనకు 2987 ఓట్లు పోలయ్యాయి. చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లు కలిగిన వ్యక్తులు బరిలో నిలిచినప్పటికీ ఎక్కడా డిపాజిట్ కూడా రాకపోవడం గమనార్హం.