జీఎస్‌టీ గందరగోళం.. ధరలు తగ్గేనా.. పెరిగేనా !

216
GST:A game changer for the Indian Economy
GST:A game changer for the Indian Economy
- Advertisement -

నేటి అర్థ రాత్రి నుండే జీఎస్‌టీ అమల్లోకి రానుంది. పార్లమెంట్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బిల్ ఆమోదం పొందితే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడదు అని మోదీ సర్కార్ గట్టిగా నమ్మి.. ప్రతిపక్షాలను సైతం ఏకం చేసి బిల్లును పాస్ చేయించింది. ఇంతలా మోడీ సర్కార్ నమ్మిన జీఎస్టీ అంటే ఏమిటి..? దానికి అంత ప్రాధాన్యత ఏముందన్నది ఇక్కడ చదవండి..

మనం ఏదైనా ఒక వస్తువును కొన్నా, లేక మరొకరి నుంచి ఏ రూపంలోనైనా సేవ అందుకుంటే మనం కట్టే పన్ను ఇది. అయితే తేడా ఏమిటంటే, అందులో ఇతర రకాలైన పన్నుల భారమంతా ఏకమైపోయి, మనం పన్ను మీద పన్ను చెల్లించవలసిన భారాన్ని తగ్గించేస్తుందీ కొత్త రూపంలోని జిఎస్‌టి. అంటే వస్తు, సేవల పన్ను. ఇలా ఒక్కదానిలోనే మిగిలినవన్నీ కలుస్తాయి. వేర్వేరుగా పన్ను చెల్లించే బాధ మనకు తగ్గుతుందన్న మాట.

GST Ipmact

జీఎస్టీ కౌన్సిల్ విడుదల చేసిన మోడల్ నోటిఫికేషన్‌ ప్రకారం.. 115 వస్తువులపై జీఎస్టీ పన్ను భారం తగ్గుతుంది. 37 వస్తువులపై పన్ను పెరగబోతుండగా, 180 వస్తువుల పన్నులో ఎటువంటి మార్పూ ఉండదు. సేవా రంగానికి సంబంధిచి 14 వస్తువులపై పన్ను భారం తగ్గుతుండగా, 27 వస్తువులపై పెరుగనుంది. వస్తుసేవలను నాలుగు రకాలుగా విభజించి 5, 12, 18, 28 శాతాలుగా జీఎస్టీని నిర్ధారించారు. ఆయా వస్తు సేవలు ఏ కేటగిరీలో ఉన్నాయనే దానిని బట్టి గరిష్టంగా అంత శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

జీఎస్టీ పన్ను శ్లాబుల్లో చేర్చిన వస్తువులను బట్టి చూస్తే.. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై పూర్తిగా పన్ను ఎత్తివేయడంతో నిత్యావసరాల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే వ్యవసాయ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించినా.. ఎరువులపై పన్ను పెంచడంతో ఆ మేరకు రైతాంగంపై భారం పడనుంది. బొట్టుబిళ్లలు, కుంకుమ, స్టాంపులు, పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు, గాజులు, చేనేత, మెట్రోరైళ్లు, లోకల్‌ రైళ్లు, మాంస ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాలు, బ్రెడ్, తేనె లాంటి వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించారు.

gst-bill

జీఎస్టీతో విలాస వస్తువులు, సేవలపై పన్ను మోత మోగనుంది. సినిమాలు, హోటళ్లు, గెస్ట్‌ హౌస్‌లు, మ్యారేజ్‌ ఫంక్షన్‌ హాళ్లు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, రేస్‌ క్లబ్‌ బెట్టింగ్‌లు, బ్యూటీ కేర్‌ వస్తువులు వంటి ధరలు బాగా పెరిగే అవకాశం ఉంది. గతంలో పన్ను లేని ఆటోమొబైల్‌ విడిభాగాలను ఏకంగా 28 శాతం పన్ను శ్లాబు కిందకు తీసుకురావడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. జీఎస్టీ నిబంధనల ప్రకారం డీలర్లు, వ్యాపారులు పన్నును ఆన్‌లైన్‌ లోనే చెల్లించాల్సి ఉంటుంది. రిజి స్ట్రేషన్, రిటర్నులు, చెల్లింపులూ ఆన్‌లైన్‌లోనే చేయాలి. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అన్ని ఇన్వాయిస్‌లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఫలితం కనిపించకపోయినా భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయంటున్నారు విశ్లేషకులు. కెనడాలో ఇదే వ్యవస్థ పకడ్భందీగా నిర్వహిస్తున్నారు. జీఎస్‌టీ వల్ల పన్ను చెల్లించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. సులభంగా చెల్లించే వీలుండటం, పన్ను విధానంలో స్పష్టత ఉండటంతో పన్ను వల్ల వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. సాధారణ ప్రజల నుంచి వ్యాపారుల వరకు కాస్త గందరగోళంలో ఉన్నప్పటికీ 2, 3 నెలల్లో అందరికీ స్పష్టత వస్తుంది.

- Advertisement -