తెలంగాణలో రాష్ట్రం వేడి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. భానుడి ప్రతాపానికి ప్రజలు సతమతమౌతున్నారు. ఈ సీజన్‌లోనే అత్యధికంగా సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలు నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. జీహెచ్‌ఎంసీలోని ఖైరతాబాద్ గణాంకభవన్ వద్ద 40.1 డిగ్రీలు రికార్డయింది. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 నుంచి 25.9 డిగ్రీల మధ్య నమోదైంది.
ఆదివారం 1.5 కిలోమీటర్ల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల వరకు విస్తరించింది. రాష్ట్రంలో ఒకటిరెండు ప్రదేశాల్లో మూడురోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అదనంగా పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.