దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య సమస్యల కారణంగా సెప్టెంబర్ 22న అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 75 రోజుల పాటు చికిత్స అందించిన అపోలో వైద్యులు….చివరకు అమ్మను కాపాడలేకపోయారు. అయితే, జయను కాపాడటానికి అపోలో ఆస్పత్రి వేసిన బిల్లు ఎంతో తెలిస్తే షాకవుతారు.
సమాచార హక్కు చట్టం ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌తో అమ్మ వైద్యానికి చేసిన ఖర్చు ఎంతో బహిర్గతమైంది. జయకు 75 రోజుల పాటు వైద్యం అందించిన చెన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం వేసిన మెడికల్ బిల్లు సుమారుగా రూ.80 కోట్లు. మిగతా ఖర్చులను కలిపితే ఇది మరికాస్త పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లులో ఇప్పటికే రూ.6 కోట్లు చెల్లించింది కూడా.
ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తరువాత జయ ఉన్న రెండో అంతస్తు మొత్తం ఖాళీ చేయించారు. దీంతో ఈ అంతస్తులోని 30 గదుల అద్దెను జయ వైద్య ఖర్చుల్లోనే కలిపారు. వీటి ఒక రోజు అద్దె రూ.కోటి. ఎక్మో, ఇతర లైఫ్ సపోర్టు యంత్రాల చార్జీలు వీటికి అదనం. అలాగే, 39 మంది అపోలో వైద్యులకు కన్సల్టేషన్ చార్జీలు, మందులు, నర్సింగ్ చార్జీలు, లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ బీలే, అతని బృందం, సింగపూర్ ఫిజియోథెరిపిస్టు చార్జీలు అదనం.
అలాగే జయ భద్రతా సిబ్బందికి చెల్లించాల్సిన బేటా ఖర్చుల బిల్లును పోలీసుశాఖ భారీగానే పంపినట్టు సమాచారం.దీంతో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజా ప్రతినిధులు అనారోగ్యానికి గురైనపుడు వైద్య ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. జయ వైద్యానికి అయిన ఖర్చులను కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.