విఘ్నాలను తొలగించే కాణిపాకం వినాయకుడు..

401
- Advertisement -

సర్వవిఘ్నాలను నివారించే దేవుడు వినాయకుడు. దేవతా గణంలో అగ్ర పూజ ఆయనకే. వక్రతుండిగా, లంబోధరుడిగా, గజాననుడు , సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు, మన రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకంలో కొలువుదీరాడు. సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది.

కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

kanipakkam

వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం.కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి. అయితే ఇక్కడి వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.

vinayaka

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం అతి పురాతనమైనది. 11వ శతాబ్దానికి చెందినదిగా చెప్పబడుతున్న ఈ ఆలయాన్ని చోళరాజైన మొదటి కుళోత్తుంగ చోళుడు కట్టించినట్టు చారిత్రక ఆధారాలద్వారా తెలుస్తోంది. అనంతరం 1336లో విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషిచేసినట్లు తెలుస్తోంది.

ఇక్కడ స్వామివారు వెలవడం వెనుక కూడా ఓ పురాణ గాథ ఉంది. పూర్వం ఆ ప్రాంతంలో చెవిటి, మూగ, గుడ్డి వాళ్ళైన ముగ్గురు సోదరులు తమ పొలంలో బావులు తీస్తుండగా ఒక్కసారిగా వారి గునపానికి రక్తపు మరకలు అంటాయట. దాంతో ఆశ్చర్యపోయిన ఆ సోదరులు ఏమిటాని చూడగా వినాయకుని మూర్తి కనిపించిందట. అలా మూర్తి కనిపించీ కనిపించగానే వికలాంగులైన ఆ ముగ్గురు సోదరులకు స్వస్థత చేకూరి మామూలు మనుషులయ్యారట. ఈ విషయం గ్రామ ప్రజలకు తెలిసి తండోపతండగాలు గ్రామస్థులు అక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టారట. వారు కొట్టిన కొబ్బరికాయల నీరు ఎకరంపావువరకు పారిందని పురణాలు చెబుతున్నాయి.

- Advertisement -