అమెరికా పీఠం హిల్లరీదేనా..?

208
- Advertisement -

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చేశాయి. ఎన్నికల ప్రారంభానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో ఎవరు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటారు అన్న చర్చలు మొదలయ్యాయి. శ్వేతసౌధ సారథిని తేల్చే ప్రక్రియలో పాల్గొనే అర్హత 20 కోట్ల మంది అమెరికన్లకు ఉంది. వీరిలో 4 కోట్ల మంది ‘ముందస్తు ఓటింగ్‌’ అవకాశాన్ని వినియోగించుకుని ఇప్పటికే ఓట్లు వేశారు.

ఎన్నడూ లేనంతగా ఈసారి పోటీ రసవత్తరంగా ఉండడంతో చివరి నిమిషం వరకూ ఫలితాన్ని నిర్ణయించే రాష్ట్రాల్లో ఇద్దరు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వారం క్రితం వరకూ పోరు హోరాహోరీ అంటూ సర్వేలు ప్రకటించగా… తాజా సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నాలుగు శాతం ఆధిక్యంలో ఉన్నారు. వాల్‌స్ట్రీట్‌జర్నల్ / ఎన్‌బీసీ న్యూస్ పోల్ ప్రకారం 44 శాతం మంది హిల్లరీని సమర్థించగా, 40 మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. మరో 6 శాతం లిబర్టేరియన్ అభ్యర్థి గ్యారీ జాన్సన్ వైపు మొగ్గు చూపారు.

US-elections-2016-638871

అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే…
అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. మొదట పౌరులు ఎలక్టోరల్‌ కాలేజీకి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు నేరుగా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. మొత్తం 50 రాష్ట్రాలుండగా, ఒక్కో రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఉభయ సభల్లో ఆ రాష్ట్రానికి గల సభ్యుల (సెనెటర్లు, రిప్రజెంటేటివ్‌లు) సంఖ్యకు సమానంగా ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. ఏ రాష్ట్రానికా రాష్ట్రం ఈ ఎన్నికలు నిర్వహిస్తాయి. అదనంగా దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీకి దేశంలోని అతిచిన్న రాష్ట్రానికి గల సభ్యులకు సమానంగా ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులను కేటాయిస్తారు. అంటే ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభ సభ్యుల సంఖ్య 435. సెనెట్‌ సభ్యుల సంఖ్య 100. వాషింగ్టన్‌కు ముగ్గురు అదనపు సభ్యులు. మొత్తం 538 మంది ఎలక్టోరల్‌ కాలేజీ ప్రతినిధులు ఎన్నికవుతారు. వీరిని ఎలెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఇందులో కనీసం 270 ఓట్లు పొందిన అభ్యర్థి అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు.

MI American USA Election 2015 ballot box vote Presidential iStock

ఎన్నికల ప్రారంభం
అమెరికాలో మొత్తం తొమ్మిది టైమ్ జోన్లున్నాయి. నవంబర్ 8 న ఈస్ట్రన్ టైమ్ జోన్‌లో ఉదయం 6 గంటలకు(భారత కాలమానం సాయంత్రం 5 గంటలు) ఎన్నికలు ప్రారంభమవుతాయి. న్యూయార్క్‌లో ఉదయం 10 గంటలైతే లాస్‌ఏంజెలిస్‌లో ఉదయం 7 గంటలు అవుతుంది. అట్లాంటిక్ సముద్రతీరం ప్రాంత రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, న్యూహ్యాంప్‌షైర్, జార్జియా, నార్త్, సౌత్ కరోలినా, మసాచుసెట్స్, మిచిగన్, న్యూజెర్సీ, న్యూయార్క్ తదితర రాష్ట్రాలు ఈస్ట్రన్ టైమ్ జోన్‌లో ఉంటే… ఇలినాయ్, ఫ్లోరిడా, కెంటకీ, టెక్సాస్ వంటి రాష్ట్రాలు సెంట్రల్ టైమ్ జోన్‌లో ఉన్నాయి. కీలక రాష్ట్రాలైన కాలిఫోర్నియా, నెవెడాలు పసిఫిక్ టైం జోన్‌లో, అరిజోనా, కొలరాడో, నెబ్రాస్కా, కాన్సాస్‌లు మౌంటెన్ టైమ్ జోన్‌లో ఉన్నాయి. అలాస్కా, హవాయ్‌లకు వేర్వేరు టైమ్ జోన్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో టైమ్ జోన్‌కు మధ్య గంట తేడా ఉంటుంది. సెంట్రల్ టైమ్ జోన్ రాష్ట్రాల్లో(రాత్రి 6 గంటలు), మౌంటెన్ టైమ్ జోన్‌లో(రాత్రి 7 గంటలకు), పసిఫిక్ టైమ్ జోన్‌లో(రాత్రి 8 గంటలకు) ఎన్నికలు మొదలవుతాయి. కెంటకీ, ఇండియానాల్లో ఎన్నికలు ముందుగా ముగుస్తాయి.

white_house

నవంబర్ 8న ఉదయం 5 గంటలకు ఎన్నికలు ప్రారంభమైతే.. నవంబర్ 9న ఉదయం 7గంటలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు నవంబర్ 9న ఉదయం 5గంటలకు మొదలైతే… అదే రోజు మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. తొలి ఫలితం న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నోచ్‌లో నవంబర్ 8 ఉదయం 10.30కే (భారత కాలమానం రాత్రి 9 గంటలు) వెల్లడవుతుంది. అక్కడ 12 మంది ఓటర్లే ఉన్నారు. 9న ఉదయం 6 గంటల(భారత కాలమానం) నుంచి ఎగ్జిట్ పోల్స్‌తో పాటు కౌంటింగ్ ప్రాంరభమవుతుంది. 10 గంటలకు ఫలితంపై ఒక అంచనా వస్తుంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడి అవుతాయి.

ఫ్లోరిడా, ఒహయో, పెన్సిల్వేనియా, న్యూ హ్యాంప్‌షైర్, మిన్నెసొటా, అయోవా, మిచిగన్, కొలరాడో, నార్త్ కరోలినా, నెవడా, విస్కాన్సన్‌లు ఫలితాన్ని తారుమారు చేసే(స్వింగ్) రాష్ట్రాలుగా భావిస్తున్నారు. ఒహయో రాష్ట్రంలో గెలవకుండా ఇంతవరకూ ఏ రిపబ్లికన్ అభ్యర్థి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. డెమోక్రాట్ల నుంచి జాన్ ఎఫ్ కెనడీ ఒకరే దీనికి మినహాయింపు. అందుకే అభ్యర్థులు దీనిపై ఎక్కువ దృష్టిపెడతారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఈ పదవికి హిల్లరీ ఎన్నికైతే.. అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలుగా నిలిచిపోతారు. ఇక ట్రంప్‌ ఎన్నికైతే అమెరికా చరిత్రలోనే కాదు.. ప్రపంచ గతిలో కూడా పెనుమార్పులు తప్పవన్నది విశ్లేషకుల భావన.

- Advertisement -