షూటింగ్‌లు నిలిచిపోవడం వల్ల ఆదాయం లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’కి హీరో సుశాంత్ రూ. 2 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆయన తెలియజేశారు. సోమవారం ఆయన, “ఇవి ఒకరినొకరు చూసుకోవాల్సిన రోజులు. ఈ సంక్షోభ సమయంలో దినసరి వేతనంతో జీవనం సాగించే సినీ కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడానికి నా వంతు చిన్న సాయంగా రూ. 2 లక్షలు కరోనా క్రైసిస్ చారిటీకి అందజేస్తానని వినమ్రంగా తెలియజేస్తున్నా. అందరూ తమ తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాల్సిందిగా కోరుతున్నా” అని ట్వీట్ చేశారు.
అలాగే కరోనా క్రైసిన్ చారిటీ (సీసీసీ)కి షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. దినసరి వేతనం మీద ఆధారపడి బతికే పేద కళాకారులు, సినీ కార్మికులను ఆదుకోవాలనే పెద్ద మనసుతో ఏర్పాటైన సీసీసీకి తమ వంతుగా ఈ చిన్న ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని వారు తెలిపారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలవాలనీ, లాక్‌డౌన్‌కు సహకరిస్తూ తమ తమ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలనీ వారు కోరారు.